పీవీకి భారత రత్న: రాజకీయ ప్రముఖుల హర్షం | Telangana Political Leaders Happy On PV Narasimha Rao Conferred With Bharat Ratna | Sakshi
Sakshi News home page

పీవీకి భారత రత్న: రాజకీయ ప్రముఖుల హర్షం

Published Fri, Feb 9 2024 2:32 PM | Last Updated on Fri, Feb 9 2024 3:30 PM

Telangana Political Leaders Happy On PV Conferred With Bharat Ratna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావును దేశ అత్యున్నత పురస్కారం భారత​ రత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి శు​క్రవారం భారత రత్న ప్రకటించింది. పీవీ​కి భారత రత్న దక్కటంపై పలువురు రాజకీయ ప్రముఖలు హర్షం వ్యక్తం చేశారు.

పీవీకి భారత రత్న దక్కటంపై తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం.’అని ఆయన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.  

తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: మాజీ సీఎం కేసీఆర్‌
తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న  దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మోదీకి ధన్యవాదాలు: ఎమ్మెల్యే కేటీఆర్‌
‘దేశ మాజీ ప్రధాని  పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం సంతోషకరం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి ఈ గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

భారత రత్న ఇవ్వటం సంతోషంగా ఉంది: పీవీ కుమార్తె.. ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి
‘తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి తెలుగు ప్రధాని మన పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పీవీ గారికి భారత రత్న ఇవ్వడంతో  భారత రత్న విలువ మరింత పెరిగింది. 1991 నుంచి 1992 భారత దేశ పరిస్థితి ఏ రకంగా ఉండేదో అందరూ ఆలోచించాలి. ప్రజల క్షేమంమే తన జీవితం అని పీవీ గారు అనుకున్నారు. కొంచం లేట్ అయిన పీవీ గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం.

... అయిన కుటుంబ సభ్యులుగా అందరం ఆనంద పడుతున్నాం. పీవీ గారి శత జయంతి ఉత్సవాలు కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పీవీ గారిని గుర్తించి భారత రత్న ఇవ్వడం ప్రధానీ మోదీ సంస్కారంకు నిదర్శనం. రాజకీయాలు  పక్కన పెట్టీ ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగు ఠీవీ పీవీకి భారతరత్న భేష్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
‘తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా నేను నగర్వపడుతున్నా. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్‌ది. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు.

.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో  ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నా. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయం’అని  బండి సంజయ్‌​ హర్షం వ్యక్తం చేశారు.

పీవీకి భారతరత్న దక్కటం దేశప్రజలందరికీ గర్వకారణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడూ పీవీ గారిని గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పీవీ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. పీవీ తుదిశ్వాస విడిచాక కూడా పార్టీ కార్యాలయంలోకి పార్థివదేహాన్ని రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ  పీవీ గారిని దారుణంగా అవమానించింది. ఢిల్లీలో పీవీ స్మృతి కేంద్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటుచేయలేదు.

... చివరకు  పీవీ అంతిమ సంస్కారంలోనూ ఆటంకాలు కల్పించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఏనాడూ.. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేయలేదు. దేశానికి పీవీ చేసిన సేవలను బీజేపీ పార్టీ నేతృత్వంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో వారిని గౌరవించడం గొప్ప విషయం’అని కిషన్‌రెడ్డి తెలిపారు.

పీవీకి భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు:  బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
‘తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వ కారణం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్ని కోరారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలంగాణ ఠీవి మన పీవీ అని కేసిఆర్ సగర్వంగా అన్ని వేదికల మీద చెప్పారు. పీవీ కూతురు వాణి దేవికి ఎమ్మెల్సిగా అవకాశం కల్పించి వారి కుటుంబానికి సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. ట్యాంక్ బండ్ మీద పీవీ విగ్రహం, నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం, అసెంబ్లీలో చిత్ర పటం పెట్టిన ఘనత కేసీఆర్‌దే’అని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement