శ్రీశైలంపై తెగని పంచాయితీ Telangana Objects To KRMB RMC Claim On Srisailam Power Sharing | Sakshi
Sakshi News home page

శ్రీశైలంపై తెగని పంచాయితీ

Published Tue, Dec 6 2022 2:25 AM | Last Updated on Tue, Dec 6 2022 10:09 AM

Telangana Objects To KRMB RMC Claim On Srisailam Power Sharing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్‌ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు.

శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్‌ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్‌ఎంసీ కన్వీనర్‌ బి.రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్‌సీకి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్‌సీ, ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ (హైడల్‌) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్‌ఎంసీ కన్వీనర్‌ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు.  

విఫలమైన ఆర్‌ఎంసీ ప్రయత్నాలు
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి,  మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్‌ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేసింది.

ఆరుసార్లు  సమావేశమైన ఆర్‌ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్‌ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్‌ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్‌ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తెలిపారు.

కనీస నిల్వ 830 అడుగులు చాలు
శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్‌ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు.

ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు.

పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ    
ఆర్‌ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్‌ వాటాలు, క్యారీ ఓవర్‌ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్‌ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్‌ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్‌ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement