మరింత చేరువగా అత్యవసర వైద్యం Six types of emergency services like trauma, heart attack are available | Sakshi
Sakshi News home page

మరింత చేరువగా అత్యవసర వైద్యం

Published Sat, Apr 22 2023 3:14 AM | Last Updated on Sat, Apr 22 2023 2:48 PM

Six types of emergency services like trauma, heart attack are available - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఇనీషియేషన్‌ (టెరి)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హార్ట్‌ అటాక్‌.. బ్రెయిన్‌ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్‌.. సర్జికల్‌ ఎమర్జెన్సీస్‌ వంటి ఆరు రకాల బాధితులకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించడం, తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఎమర్జెన్సీ కేసుల్లో 24% ట్రామా బాధితులే..
ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24 శాతం ట్రామా బాధితులే (గాయాలకు గురైనవారు) ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, చేరిన 24 గంటలలోపు జరిగే 40 శాతం మరణాలకు రక్తస్రావం కారణం అవుతోంది. అయితే ప్రీ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ సర్విసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్‌ ఫెసిలిటీస్‌ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.

సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40 శాతం హాస్పిటల్‌ మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని రహదార్లు కవర్‌ అయ్యేలా 55 ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, 17 టీచింగ్‌ ఆసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటినే ‘టెరి’లుగా వ్యవహరిస్తారు. 

ప్రీ హాస్పిటల్‌ సేవలు.. 
ప్రీ హాస్పిటల్, ఇంట్రా హాస్పిటల్‌ సేవలుగా విభజించి ట్రామా కేర్‌ సెంటర్లలో సేవలు అందించనున్నారు. ౖప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాద బాధితులను తక్షణమే, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చుతారు. ప్రమాద స్థలికి 108 అంబులెన్స్‌ వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తారు.

ప్రస్తుతం 426 అంబులెన్సులు ఉండగా, 292 వాహనాల్లో ఏఈడీలున్నాయి. మిగతా 133 వాహనాల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు. 108 వాహనంలోకి బాధితుడిని తీసుకున్న వెంటనే అతని ఆరోగ్య పరిస్థితిని ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆసుపత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు.  

ఇంట్రా హాస్పిటల్‌ కేర్‌... 
ట్రామా కేర్‌ ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో తగిన మార్పులు చేయనున్నారు. అంబులెన్స్‌ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయడంతో పాటు, దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయం కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలు కొనసాగిస్తారు.

క్యాజువాలిటీ డిపార్ట్‌మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్లుగా మార్చుతారు. ఎమర్జెన్సీ విభాగంలో డెడికేటెడ్‌ ట్రయాజ్‌ ఏర్పాటు చేస్తారు. ఇందులో నాలుగు క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగు సూచీలతో వీటిని విభజిస్తారు. ట్రయాజ్‌లో మల్టీ పారామీటర్‌ మానిటర్లు, మెడికల్‌ గ్యాస్‌ ఔట్‌ లెట్స్, ఇతర వైద్య సదుపాయాలు ఉంటాయి.  

అందుబాటులో అధునాతన వైద్య పరికరాలు
ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం, 5,000 చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ మెడికల్‌ డిస్పాచ్‌ (ఈఎండీ) ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రుల సామర్థ్యాన్ని బట్టి ఎమర్జెన్సీకి పడకలు కేటాయిస్తారు. ఆటోక్లేవ్‌ మిషన్, మొబైల్‌ ఎక్స్‌ రే, ఈ ఫాస్ట్, సక్షన్‌ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్‌మెంట్‌ వంటి అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో ట్రామా కేర్‌ సెంటర్‌లో మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్‌ సిబ్బంది ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ అందజేస్తారు.  

ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకు కృషి 
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోం. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయాల్లో సరైన సమయంలో అవసరమైన వైద్యం అందక బాధితులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు ‘టెరి’కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట< వ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.  – టి.హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement