‘జానారెడ్డి కూడా అసత్యాలకు మొగ్గు చూపడం బాధాకరం’ | Opposition Parties Are Making False Propaganda On Jobs Recruitment Says Minister KTR | Sakshi
Sakshi News home page

‘జానారెడ్డి కూడా అసత్యాలకు మొగ్గు చూపడం బాధాకరం’

Published Fri, Feb 26 2021 2:26 AM | Last Updated on Fri, Feb 26 2021 9:03 AM

Opposition Parties Are Making False Propaganda On Jobs Recruitment Says Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ విషయంలో అసత్యాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రతిపక్షాలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఇందులో భాగంగానే నిజాలను దాచి పెడుతున్నాయని మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2020 వరకు రాష్ట్రంలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని, అనుమానాలుంటే ఆయా శాఖల్లో ధ్రువీ కరించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్ప నపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నా యంటూ ప్రభుత్వ శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడిన బహిరంగ లేఖను కేటీ రామారావు గురువారం విడుదల చేశారు. 

నిజాలను జీర్ణించుకోలేకే..
‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ద్వారా అంకెలతో సహా సాధికారికంగా వివరించా. ఈ నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను గందరగోళానికి గురి చేసేం దుకు ప్రయత్నిస్తున్నాయి’అని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘జానారెడ్డి లాంటి సీనియర్‌ రాజ కీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లెవేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామనే హామీ మేరకు మేం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం.

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఉద్యోగ నియామకాల వివరాలు ఇస్తా మనే జానారెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నా.. అం దులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలి చ్చారో కూడా చెప్పాలని కోరుతున్నా.. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పిం చాం..’అని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉద్యో గాల కల్పన చేపడుతూనే ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గాల భర్తీ విషయంలో అత్యంత పారదర్శకత పాటించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఉమ్మడి ఏపీలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై అవినీతి ఆరోపణలు ఉండేవని, టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ, తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రకియను వేగంగా పూర్తి చేస్తామని, ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలని, కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా యువత ఆలోచించాలని కేటీఆర్‌ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కల్పించిన 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను కేటీఆర్‌ శాఖల వారీగా వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement