No Possibility Of Issuing New Ration Cards In Telangana State - Sakshi
Sakshi News home page

కొత్త రేషన్‌ కార్డులు ఇప్పట్లో లేనట్టే!

Published Mon, May 22 2023 9:54 AM | Last Updated on Mon, May 22 2023 10:27 AM

No Possibility Of Issuing New Ration Cards In Hyderabad State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులను ఇప్పట్లో జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జూన్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీని ప్రారంభించనున్నట్టు సోషల్‌ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం కొత్త రేషన్‌ కార్డుల జారీ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని.. ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఆలోచనేదీ లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటికే కుటుంబాలను మించి కార్డులు రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల కన్నా అత్యధిక సంఖ్యలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. అనర్హులకు ఇచ్చిన కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు ఆలోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మిన్నకుండి పోయింది. 2018 ఎన్నికలకు ముందు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సర్కారు.. 2021 వరకు పలు దఫాల్లో 3.11 లక్షల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.

అయితే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్‌ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్‌ఎస్‌సీఆర్‌ఎం వెబ్‌సైట్‌లో చేసుకుంటున్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు. 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 90,14,263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న యూనిట్ల (కుటుంబ సభ్యుల) సంఖ్య 2.83 కోట్లు. అంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండొంతుల మేర ప్రజలు వీటి పరిధిలో ఉన్నారు.

ఇక రేషన్‌ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కింద 5.62 లక్షల కార్డులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ భరిస్తూ ఇచ్చిన ఆహార భద్రత కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 35.66 లక్షల మేర ఉన్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద వినియోగంలో ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. ఏఏవై, అన్నపూర్ణ మినహా మిగతా రేషన్‌ కార్డులపై ప్రతినెలా కుటుంబంలోని ఒక్కొక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది.

కరోనా ప్రబలిన నేపథ్యంలో 2021 నుంచి ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు గత ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లుగానే.. ఈసారి కూడా అవకాశం ఇచ్చిందని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూన్‌ నుంచే కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పౌర సరఫరాల శాఖ తోసిపుచ్చింది. కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘సాక్షి’కి స్పష్టం చేసింది.

(చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement