ఏకాభిప్రాయానికి చివరి యత్నం | KRMB Final Effort To Reach Consensus On RMC Recommendations | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయానికి చివరి యత్నం

Published Fri, Nov 18 2022 1:07 AM | Last Updated on Fri, Nov 18 2022 8:46 AM

KRMB Final Effort To Reach Consensus On RMC Recommendations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సిఫారసులపై ఏకాభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తుది ప్రయత్నం చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్‌ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వ హించనుంది. ఈ మేరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ గురువారం లేఖ రాసింది.

ఈ సమావే శానికి ఏ ఒక్క రాష్ట్రం ప్రతినిధులు గైర్హాజరైనా లేక కమిటీ సిఫారసులపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరక పోయినా.. తన కార్యాచరణలో ఆర్‌ఎంసీ విఫలమైనట్టు నివేదిస్తామని స్పష్టం చేసింది. గతంలో కొన్ని ఆర్‌ఎంసీ సమావేశాలకు తెలంగాణ, ఏపీలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నిబంధనను పొందుపర్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్ల నిర్వ హణకు సంబంధించిన విధివిధానాలను (రూల్‌ కర్వ్‌) సిఫారసు చేసేందుకు గతంలో ఆర్‌ఎంసీని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది.

ఈ సిఫారసులకు తుది రూపమివ్వడంతో పాటు సంతకాల స్వీకరణ కోసం చివరిసారిగా 24న ఆర్‌ఎంసీ సమావేశాన్ని తలపెట్టింది. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై సైతం ప్రస్తుత భేటీలో పునః సమీక్ష కోరవచ్చని తెలిపింది. 

ఏకాభిప్రాయం కష్టమేనా?
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ఎంతమేర నీటి నిల్వలున్నప్పుడు, ఎంత మేర నీళ్లను సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు విని యోగించాలి అన్న అంశంపై ఆర్‌ఎంసీ సిఫారసు లు చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలికంగా కృష్ణాజలాల పంపిణీని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచేలా రూల్‌ కర్వ్‌లో పొందుపర్చాలని డిమాండ్‌ చేస్తోంది.

శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించుకోవడానికి ఉండాల్సిన కనీస నిల్వ మట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ అంటుండగా, 854 అడుగులుండాలని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం జలాలు పూర్తిగా జలవిద్యుదుత్పత్తి కోసమేనని తెలంగాణ అంటుండగా, సాగు, తాగునీటి అవస రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ పేర్కొంటోంది. వరద జలాల వినియోగాన్ని సైతం లెక్కించి సంబంధిత రాష్ట్రం ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ వ్యతిరేకిస్తోంది. ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల సమ్మతితో రూల్‌కర్వ్‌కు తుది రూపు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే చివరి సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని, లక్ష్య సాధనలో ఆర్‌ఎంసీ విఫలమయ్యే సూచనలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement