ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు! Hyderabad: Pre Launch Danda In Commercial Projects | Sakshi
Sakshi News home page

ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు!

Published Mon, Sep 26 2022 2:31 AM | Last Updated on Mon, Sep 26 2022 3:28 PM

Hyderabad: Pre Launch Danda In Commercial Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఓ పక్క గృహ నిర్మాణాలలో ప్రీలాంచ్‌ విక్రయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న బిల్డర్లు.. పెట్టుబడిదారులనూ వదలడం లేదు. స్థలం కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు రాకముందే కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్‌ డిజైన్లు, అందమైన బ్రోచర్లతో ఆకర్షిస్తున్నారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే బ్యాంక్‌ వడ్డీ రేట్ల కంటే ఎక్కువే లాభం, వంద శాతం సొమ్ము ముందే చెల్లిస్తే సగం ధరకే వాణిజ్య స్థలం, ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక రెట్టింపు అద్దె అంటూ అన్ని రకాల మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చివరకు నట్టేట ముంచేస్తున్నారు. 

బాధితులు వేల సంఖ్యలో.. 
సాహితీ, ఫీనిక్స్, సీఎన్‌ఎన్‌ వెంచర్స్, సెన్సేషన్, గరోండా బిల్డర్స్, సంధ్యా కన్వెన్షన్‌ వంటి నిర్మాణ సంస్థలెన్నో షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామని జనాలను నమ్మించి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి హైస్ట్రీట్‌ ఏరియాలలో ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి.

బిల్డర్ల చేతిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్‌ పోలీసులు, ప్రవాసులూ చిక్కి విలవిల్లాడుతున్నారు. కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలని డెవలపర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ బిల్డర్లు బౌన్సర్లను నియమించుకుని కొనుగోలుదారులను కనీసం ఆఫీసు లోపలికి కూడా రానివ్వటం లేదని సత్యా టెక్నో పార్క్‌ బాధితుడు వాపోయారు. 

10 ఏళ్ల పాటు ప్రతి నెలా అద్దె! 
సెన్సేషన్‌ ఇన్‌ఫ్రాకాన్‌ నానక్‌రాంగూడలో జీ+47 అంతస్తులలో హైదరాబాద్‌ వన్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. రూ.60 లక్షలకు 397 చ.అ., రూ.82 లక్షలకు 546 చ.అ. స్పేస్‌ను ప్రీలాంచ్‌లో భాగంగా విక్రయిస్తోంది. రూ.60 లక్షల పెట్టుబడిదారులకు రూ.14,500, రూ.82 లక్షల వాళ్లకు రూ.62 వేలు అద్దె ప్రతి నెలా కంపెనీయే చెల్లిస్తుందని మాయమాటలు చెబుతోంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 10 ఏళ్ల పాటు ఈ అద్దె అగ్రిమెంట్‌ ఉంటుందని నమ్మబలుకుతోంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవచ్చని లేదా కస్టమర్ల పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ వల వేస్తోంది. ఇంతా చేస్తే ప్రాజెక్ట్‌ను నిర్మించే స్థలం సెన్సేషన్‌ కంపెనీ పేరు మీదే లేకపోవటం గమనార్హం. 

అంతా గోల్‌మాల్‌..  
బోయిన్‌పల్లిలో 4 ఎకరాలలో ధనా మాల్‌ నిర్మిస్తామని సీఎన్‌ఎన్‌ వెంచర్స్‌ ప్రచారం చేసింది. 120 చ.అ. స్థలం రూ.10 లక్షల చొప్పున వందలాది మందికి విక్రయించింది. కానీ సంస్థకు నేటికీ నిర్మాణ అనుమతులు రాలేదు. ప్రాజెక్ట్‌ నిలిచిపోవడంతో కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారులు రోజూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సంస్థ మాత్రం కిక్కురుమనడం లేదు. తాజాగా ఇదే సంస్థ బెంగళూరులోని చిక్కజల ప్రాంతంలో 7 ఎకరాలలో ధనా మాల్‌ పేరిట ప్రీలాంచ్‌ కింద కమర్షియల్‌ రిటైల్‌ షాపింగ్‌ స్పేస్‌ను విక్రయిస్తుండటం గమనార్హం. 

కమర్షియల్స్‌ను ప్రీలాంచ్‌లో విక్రయించకూడదు 
కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను కూడా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌–రెరా)లో నమోదు చేయాలి. రిజిస్టర్‌ చేయకుండా విక్రయాలు చేయకూదు. నిబంధనలు అతిక్రమించిన డెవలపర్లకు ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. 
– కె.విద్యాధర్, టీఎస్‌ రెరా సెక్రటరీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement