5 ఏళ్ల బాలుడికి రోజురోజుకూ పెరుగుతున్న 'తల' | Head Weight Of 5 Year Old Boy Increased Day By Day In Nizamabad | Sakshi
Sakshi News home page

5 ఏళ్ల బాలుడికి రోజురోజుకూ పెరుగుతున్న 'తల'

Published Mon, Mar 1 2021 8:32 AM | Last Updated on Mon, Mar 1 2021 11:21 AM

Head Weight Of 5 Year Old Boy Increased Day By Day In Nizamabad - Sakshi

ఇందూరు: నిరుపేద కుటుంబంతో విధి ఆటలాడుతోంది. ఐదేళ్ల బాలుడికి ‘తల’కు మించిన భారం తెచ్చి పెట్టింది. అనుకోని వ్యాధి అతడ్ని రాకాసిలా పట్టి పీడిస్తోంది. తమకు కలిగిన సంతాన్ని చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. పిల్లాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్, హారిక 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలు జని్మంచారు. అయితే, నెలలు నిండక ముందే జని్మంచిన ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక 41 రోజులకు కన్నుమూశాడు. మిగిలిన ఒక్క బాబునైనా ప్రేమగా చూసుకోవాలని తపించిన తల్లిదండ్రులకు అనుకోని ఆపద వచ్చి పడింది. 

ముద్దుగా శివయ్య (శివ) అని పేరు పెట్టుకున్న బాలుడికి ఐదో నెల నుంచే తల భాగం అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. వైద్యం చేయడానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు. కొన్ని చోట్ల స్కానింగ్‌లు తీయించారు. ఏవో రాసిచ్చిన కొన్ని మందులు కూడా వాడారు. అయినా ఫలితం కనిపించ లేదు. రోజు రోజుకు నీరు చేరి తల భాగం మాత్రం పెరుగుతోంది. తల భారంగా మారడంతో బాలుడికి అవస్థ కూడా ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. పిల్లాడ్ని కాపాడాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్‌ చేయడం వీలు కాదని, చేసినా ప్రయోజనం ఉండదని, ఉన్నన్ని రోజులు బాగా చూసు కోండని చెప్పి పంపించి వేశారు. ఏం జరిగినా ఫర్వాలేదని, ఆపరేషన్‌ చేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా వైద్యులు ఒప్పుకోలేదు. 

శివయ్యకు ఎన్ని సమస్యలో.. 
ఐదేళ్ల బాలుడు శివయ్యకు తల భారంతో పాటు కళ్లు సరిగ్గా కనిపించవు. కాళ్లు, చేతులు కూడా సక్రమంగా పని చేయవు. నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బాబుని ఎత్తుకోవడం, పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ఏదీ తినడు. ద్రవ రూపంలో ఆహారం అందిస్తేనే జీర్ణం అవుతోంది. ఇందుకు కుటుంబ సభ్యులు అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని తినిపిస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆహారంగా మారింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ డాక్టరు వైద్యం అందించడం లేదని, కనీసం మందులు కూడా రాసివ్వడం లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇప్పటి వరకు రూ.8 లక్షల పైనే ఖర్చు.. 
బాలుడి పరిస్థితిని చూసి అమ్మమ్మ అతడికి సపర్యలు చేస్తోంది. శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానం కలిగింది. మూడేళ్ల ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, శివయ్యకు వచ్చిన వ్యాధిని నయం చేయించడానికి అప్పులు చేసి, బంగారం అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. రూ.8 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆదుకోవాలని దాతలను కోరుతున్నారు. 

సదరం సరి్టఫికెట్‌ కోసం వచ్చి... 
శివయ్యకు ప్రభుత్వం అందించే దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని తండ్రి శ్రీకాంత్‌తో పాటు అమ్మమ్మ లక్ష్మి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చారు. వీరిని ‘సాక్షి’ కదిలించగా తమ గోడు వెల్లబోసుకున్నారు.  సదరం సరి్టఫికెట్‌ కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న సదరం సెక్షన్‌ అధికారిని కలిశామని, సరి్టఫికెట్‌ ఇప్పించి పింఛన్‌ మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన అధికారులు సదరం సరి్టఫికెట్‌ ఇప్పించడానికి చర్యలు తీసుకున్నారు. 
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ : 75691 44233 

చదవండి : (ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కట్టేసి చిత్రహింసలు)
(భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement