అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు! Do not be complacent about fevers and respiratory diseases | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే అత్యంత కీలకం.. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు!

Published Sun, Mar 12 2023 1:49 AM | Last Updated on Sun, Mar 12 2023 11:11 AM

Do not be complacent about fevers and respiratory diseases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లూయెంజా లైక్‌ ఇల్‌నెస్‌ (ఐఎల్‌ఐ), సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ (ఎస్‌ఏఆర్‌ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

సీజన్‌ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్‌ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

జాగ్రత్తలు తప్పనిసరి... 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్‌ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి.

ఈ వైరస్‌ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

వైరస్‌ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. 

కోవిడ్‌–19 జాగ్రత్తలు మరవద్దు.. 
దేశవ్యాప్తంగా కోవిడ్‌ కట్టడిలో ఉన్నా..  ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్‌ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్‌ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్‌ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది.

కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్‌–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ టెస్ట్‌ పాజిటివిటీ రేట్‌ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్‌ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు.

ఇన్‌ఫ్లూయెంజా ఏటా సీజనల్‌గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement