‘బంధం’ తెగిపోతోంది! | Sakshi
Sakshi News home page

‘బంధం’ తెగిపోతోంది!

Published Sun, Jun 16 2024 4:56 AM

Divorce rate is ever increasing in the country

దేశంలో నానాటికీ పెరుగుతున్న విడాకుల శాతం 

పెళ్లయిన ఏడాది, రెండేళ్లకే విడిపోతున్న జంటలు 

మహారాష్ట్రలో అత్యధికంగా 18.7 శాతం, తర్వాతి స్థానాల్లో కర్ణాటక, యూపీ.. 

6.7 శాతం విడాకులతో ఏడో ప్లేస్‌లో ఉన్న తెలంగాణ 

వివాహ వ్యవస్థ ఒత్తిళ్లకు గురవడం, సామాజిక–సంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణే కారణం

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లంటే నూరేళ్ల పంట అని, దంపతులు జీవితాంతం కలిసి ఉండటమే లక్ష్యమనేది ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. ఎన్నో జంటలు పెళ్లయిన ఏడాది, రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు, సంపన్నవర్గాల్లోనే కొంతవరకు కనిపించిన ఈ ట్రెండ్‌.. ఇప్పుడు అన్నివర్గాల్లోనూ సాధారణమైపోయింది. 

గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విడాకులు అనగానే అదేదో మంచి పద్ధతి కాదని చాలా మందిలో తొలుత అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారికంగా జీవించడమనే భావన దానిని అధిగమిస్తోంది. 

పరస్పర అంగీకారానికి దూరమై.. 
వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం.. ఇతర మార్గాలను అన్వేíÙంచకుండానే కోర్టు మెట్లు ఎక్కడం.. ఆధునిక సమాజంలో మారుతున్న కాలంతో వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురవడం.. సామాజిక–సంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణ వంటివి విడాకులు పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. 

గణాంకాలను బట్టి 2022 చివరినాటికి విడాకుల శాతంలో.. మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. కోర్టులో ఏళ్లకేళ్లు సాగుతున్న కేసుల నేపథ్యంలో.. అనధికారికంగానే విడిగా ఉంటున్న జంటలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. 

విడాకులు పెరగడానికి ప్రధాన కారణాలివీ
» దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేకపోవడం.. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు 
» వివాహ బంధంలో భావోద్వేగం కొరవడటం 
»  ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడం.. జీవనం సాగిస్తున్న తీరుపై అసంతృప్తి, అభద్రతా భావం, కుంగుబాటు 
» భిన్నమైన కుటుంబ నేపథ్యం, విలువలు కలిగి ఉండటం.. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం 
» ఇద్దరు పనిచేసే వేళల్లో అంతరాలు ఉండటం 
» మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు విడాకుల లెక్కలివీ.. 
» 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 
»  ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 5,500 విడాకుల కోసం వచి్చనవే. ఇందులోనూ మూడు వేల కేసులు పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులే. 
» దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో గత పదేళ్లలో విడాకులు 350 శాతం పెరిగాయి. 
» పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లోనూ విడాకులు బాగా పెరిగాయి. 
»  ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

ఆర్థిక స్వేచ్ఛ, బాధ్యతల భారంతో.. 
కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగవకాశాలు పెరిగాయి. మహిళలకూ ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు, గిల్లికజ్జాలు, చికాకులు, ఇబ్బందులు, సమస్యలతో వివాహ బంధాన్ని కొనసాగించడం కంటే.. విడిపోవడమే మేలనే భావనకు వస్తున్నారు. 

పాత, సంప్రదాయ పద్ధతుల్లో ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటుండటం, కొన్నిసార్లు ప్రతీ చిన్న విషయంలో కలుగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడడం.. దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడం విడిపోవడానికి దారితీస్తున్నాయి.      – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌ విడిపోవడానికే మొండి పట్టు 

ఈ మధ్యకాలంలో వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వారిలో కొందరు కౌన్సెలింగ్‌తో వెనక్కి తగ్గుతుంటే.. చాలా మంది మొండిగా విడిపోవడానికే పట్టుపడుతున్నారు. విడాకులకు కారణాల్లో తల్లితండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేం తక్కువ అంటూ వారు రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. 

కుటుంబ విలువలు, సంబంధాలు తగ్గిపోవడం, పరస్పర అవగాహన, ఆకర్షణ లేకపోవడం, అనుమానాలు పెరగడం వంటివి విడాకులకు దారితీస్తున్నాయి. పరస్పరం తప్పులను ఎత్తిచూపకుండా ఉండటం, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేకపోవడం, గొడవల్లోకి తల్లితండ్రులు, తోబుట్టువులను తీసుకురాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. దంపతుల మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి.  – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్‌ కాలేజీ క్లినికల్‌ సైకాలజిస్ట్‌   

Advertisement
 
Advertisement
 
Advertisement