తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు | Credit Focus Paper 2023 24 Released By NABARD | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు

Published Fri, Dec 23 2022 2:19 AM | Last Updated on Fri, Dec 23 2022 3:46 PM

Credit Focus Paper 2023 24 Released By NABARD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్‌ పేపర్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది.

వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్‌ పేపర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది.  

సాగులో దేశానికే రోల్‌మోడల్‌ తెలంగాణ: మంత్రి హరీశ్‌ 
రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్‌ మోడల్‌గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్‌ కాకతీయ పథకాన్ని అమృత్‌ సరోవర్‌ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్‌ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు.

ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. 

ఆయిల్‌పాం సాగుకు చేయుత ఇవ్వాలి... 
నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. 

తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్‌ 
రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్‌డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement