‘సెర్చ్‌’ ఏదీ ? | Sakshi
Sakshi News home page

‘సెర్చ్‌’ ఏదీ ?

Published Sun, Jun 16 2024 4:59 AM

Committees yet to meet for selection of VCs of varsities

వర్సిటీల వీసీల ఎంపికకు ఇంకా భేటీ అవ్వని కమిటీలు 

మూడువారాలుగా ఐఏఎస్‌ల చేతుల్లోనే ఇన్‌చార్జ్‌ బాధ్యతలు  

సాక్షి, హైదరాబాద్‌ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్‌లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. 

సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్‌టీయూహెచ్‌లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్‌ కాలేజీలు అంటున్నాయి. 

మరోవైపు ఐఏఎస్‌లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్‌ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  

సెర్చ్‌ కమిటీలు ఏమైనట్టు? 
వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్‌ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 

పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్‌ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. 

ఒత్తిడే కారణమా...? 
ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. 

మరోవైపు నిజామాబాద్‌కు చెందిన మరో కాంగ్రెస్‌ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్‌టీయూహెచ్‌ వీసీ పోస్టుకు ఎన్‌ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్‌ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది.  

ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది.  

బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement