విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు? BRS demands fair investigation in electricity purchases: Jagadish Reddy | Sakshi
Sakshi News home page

విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?

Published Mon, Jun 17 2024 5:32 AM

BRS demands fair investigation in electricity purchases: Jagadish Reddy

జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ తీరుపై కేసీఆర్‌ సందేహాలు న్యాయబద్ధమే

విద్యుత్‌ కొనుగోళ్లతో తెలంగాణకు ఎక్కడా నష్టం జరగలేదు: మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ వేసిందని, కమిషన్‌ సందేహాలకు కేసీఆర్‌ బహిరంగంగా సమాధానం ఇచ్చారన్నారు. కమిషన్‌ ఉద్దేశం వేరేలా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు.

నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని, కమిషన్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్‌ సూచించారని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలని చెప్పారన్నారు. కానీ 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డికి పేరు ఉందని, చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెబుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ స్వతంత్ర కమిషన్‌ అని, అది ఇచి్చన తీర్పు ఫైనల్‌ అన్నారు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్‌ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్‌ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్‌ కొనుగోలులో కేసీఆర్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా.

బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్‌ కొన్నాయని, తెలంగాణ మాత్రం యూనిట్‌కు రూ.3.90 పెట్టి విద్యుత్‌ తీసుకున్నట్టు వివరించారు. దేశంలో ఏ కమిషన్‌ మధ్యలో లీకులు ఇవ్వలేదని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశామని, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆరీ్టపీసీ నుంచి సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ద్వారానే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని వివరించారు.

పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించినట్టు తెలిపారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని, రేవంత్‌రెడ్డి మోదీ లైన్‌లో పని చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి మాటలను పట్టించుకోమని, పీసీసీ పదవి డబ్బులతో రేవంత్‌ తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి అనలేదా అని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement