సెకండ్‌ వేవ్‌: సర్జరీలకు కరోనా బ్రేక్‌! | Break For Surgeries In Government Hospitals Due To Corona | Sakshi
Sakshi News home page

సర్జరీలకు కరోనా బ్రేక్‌!

Published Thu, Apr 8 2021 8:17 AM | Last Updated on Thu, Apr 8 2021 8:17 AM

Break For Surgeries In Government Hospitals Due To Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడింది. గాంధీ, నిమ్స్, ఉస్మానియా జనరల్‌ హాస్పిటళ్లు సహా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలకు బ్రేక్‌ పడింది. అత్యవసర ఆపరేషన్లు మినహా మిగతా అన్నింటినీ డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల నుంచి ఆపరేషన్‌ థియేటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకుతోంది. తాజాగా కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సర్జరీలను నిలిపేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన బాధితులను కూడా కరోనా తీవ్రత తగ్గి, పరిస్థితులు మెరుగయ్యాక రావాల్సిందిగా చెప్పి పంపేస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేక సర్జరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌కు తాళం 
హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 650 నుంచి 700 మంది రోగులు వస్తుంటారు. ముక్కులో కండ పెరిగి శ్వాసకు ఇబ్బందికావడం, చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ చికిత్సలు వంటి ఆపరేషన్లు.. రోజుకు సగటున 20 నుంచి 25 వరకు జరిగేవి. అయితే ఆపరేషన్‌ థియేటర్‌లో పనిచేసే అనస్థీషియన్, సిస్టర్లకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో బుధవారం నుంచి సర్జరీలు వాయిదా వేసి, ఆపరేషన్‌ థియేటర్లకు తాళం వేశారు. ఇప్పటికే చికిత్స కోసం ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న వారికి.. వారం పది రోజుల తర్వాత రావాలంటూ డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు.

ఉస్మానియా, గాంధీలో 60 శాతానికి పడిపోయిన సర్జరీలు 
ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో 11 ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా.. వాటన్నింటిలో కలిపి రోజుకు సగటున వంద మైనర్, 25 మేజర్‌ ఆపరేషన్లు జరుగుతుంటాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రస్తుతం అత్యవసరమైనవి మినహా సాధారణ చికిత్సలను చేయడం లేదు. దీంతో ప్రస్తుతం రోజుకు 40లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక గాంధీ ఆస్పత్రిలో 28 ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా.. చిన్నా పెద్దా అన్నీ కలిపి గతంలో రోజుకు సగటున 150 శస్త్రచికిత్సలు జరిగేవి. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా మార్చడంతో గత మార్చి నుంచి డిసెంబర్‌ వరకు ఆపరేషన్‌ థియేటర్లను మొత్తంగా మూసేశారు. ప్రాక్టీస్‌కు దూరమవుతున్నామన్న వైద్య విద్యార్థుల ఆందోళనతో జనవరి తర్వాత పునరుద్ధరించారు. అయినా జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీలు సహా ప్లాస్టిక్‌ సర్జరీలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రుల్లోనూ సర్జరీలు చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కుటుంబ నియంత్రణ శిబిరాలు కూడా వాయిదా పడ్డాయి.

నిలిచిన ట్రాన్స్‌ప్లాంటేషన్లు 
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కొంతమేర అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నప్పటికీ...ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాగా తగ్గిపోయాయి. నిమ్స్‌ మూత్రపిండాల విభాగంలో గతంలో వారానికి నాలుగు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసేవారు. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఒకటి రెండే చేస్తున్నారు. కీలకమైన గుండె మారి్పడి, కాలేయ మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ టెస్టులతోపాటు స్టెంట్‌ ప్రొసీజర్లు కూడా సగానికి పడిపోయాయి. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8,633 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 4,383 మంది కిడ్నీ కోసం, 3,950 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం వేచి ఉన్నారు. గతంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలే కాకుండా లైవ్‌ డోనర్ల (బంధువులు) నుంచి కూడా అవయవాలు తీసుకుని బాధితులకు అమర్చేవారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అసలు గత ఏడాది కాలంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రుల్లో ఒక్క గుండె, కాలేయ మార్పిడి చికిత్స కూడా జరగకపోవడం గమనార్హం.

ఈ బాలుడి పేరు మణిదీప్‌. ముక్కు లో కండరాలు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఆపరేషన్‌ థియేటర్లు (ఓటీ) మూసివేశామని.. ఫ్యూమిగేషన్‌ తర్వాత రీఓపెన్‌ చేసి, చికిత్స చేస్తామని చెప్పారు. ఆ బాలుడేమో నోటితోనే శ్వాస తీసుకోవాల్సి వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.  

వారం తర్వాత రమ్మన్నారు 
కన్నుకు, దవడకు మధ్య గాయమైంది. చర్మంతోపాటు కండరాలు దెబ్బతిన్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక 15 రోజుల కింద గాంధీ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షించి ప్లాస్టిక్‌ సర్జరీ చేయాలన్నారు. మందులు రాసి పంపారు. డాక్టర్లు చెప్పిన మేరకు బుధవారం మళ్లీ గాం«దీకి వచ్చాను. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరో వారం తర్వాత వస్తే.. అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 
–వాజిద్, ఖమ్మం 

వైద్యులు కూడా భయపడుతున్నారు 
కరోనా శకం ముగిసిపోయిందని అంతా సంతోషపడ్తున్న సమయంలోనే సెకండ్‌ వేవ్‌ మొదలైంది. వైరస్‌ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఏ స్ట్రెయిన్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక వైద్యులు సైతం భయపడుతున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లేందుకే వెనుకాడుతున్నారు. ఫలితంగా సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి అంతా టీకా వేయించుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. విధిగా మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. వ్యక్తిగత శుభ్రతతోపాటు పౌష్టికాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. 
–డాక్టర్‌ రవిశంకర్, ఈఎన్‌టీ నిపుణుడు
చదవండి:
మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి  
కరోనా కేసులపై వైద్యశాఖ కీలక నిర్ణయం..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement