‘డిజైన్డ్‌’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!! | Beware Of The Symbiosis Culture That Is Settling In The City | Sakshi
Sakshi News home page

‘డిజైన్డ్‌’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!

Published Fri, Jul 12 2024 10:09 AM | Last Updated on Fri, Jul 12 2024 10:09 AM

Beware Of The Symbiosis Culture That Is Settling In The City

కొన్ని లాభాలున్నా మరికొన్ని నష్టాలు

వివిధ కారణాలతో సై అంటున్న యువత

సెలబ్రిటీల జీవితాల్లో సర్వసాధారణ కల్చర్‌

ఈ కల్చర్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ‘లివిన్‌’ మోసాలు

ఏడాదిలో 2వేలకు పైగా ఫిర్యాదులు

సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి

‘లయన్స్‌ గేట్‌ ప్లే’ అధ్యయనంలో వెల్లడి

కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్‌గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్‌’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్‌గా కొనసాగే వారూ ఉన్నారు.

ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్‌ గేట్‌ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్‌గేట్‌ ప్లే రిలేషన్‌ షిప్‌ మీటర్‌’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్‌ రిలేషన్‌ షిప్స్‌కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరో

శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్‌ రిలేషన్‌ షిప్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్‌ షిప్‌లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.

భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్‌..
ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు.  కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్‌ సెక్స్‌కి చెందిన క్లోజ్‌ ఫ్రెండ్‌ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.

ఎంపికలో కీలకం ఇవే..
భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్‌కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్‌ షిప్‌లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.

బ్రేకప్‌.. వాట్‌ నెక్ట్స్‌?
అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్‌గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్‌ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని  33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం  ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.

తారా పథంలో..
ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్‌ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్‌ రిలేషన్‌íÙప్‌ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్‌లో బ్రాడ్‌పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్‌దత్‌లతో పాటు కరీనా–సైఫ్‌ అలీఖాన్‌ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్‌ని కలర్‌ఫుల్‌గా 
మార్చారు.

నగరంలో స్థిరపడిన సంస్కృతి..
వుయ్‌ ఆర్‌ మ్యారీడ్‌ అన్నంత సహజంగా వుయ్‌ ఆర్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ అంటున్నాయి జంటలు. ఆ  అనుబంధం పేరే లివిన్‌. ‘లివింగ్‌ టు గెదర్‌’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్‌ రిలేషన్‌íÙప్‌’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

పెరుగుతున్న మోసాలు.. 
గతంలో మహిళా కమిషన్‌ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్‌ ఇన్‌కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్‌ నిలిచింది. లివిన్‌ చీటింగ్‌ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్‌ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి..
ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్‌’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.

పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది.  అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే  అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్‌ పవర్‌ ఆఫ్‌ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.

‘లివిన్‌’కు కారణాలెన్నో..
నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్‌వేర్‌.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.

  • మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్‌ను, విజయాలను కోరుకోవడం, కెరీర్‌ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.

  • వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్‌ షేర్‌ చేసుకోవడంతో మొదలై ‘లివిన్‌’గా మారుతోంది.

  • పబ్స్‌ నుంచి క్లబ్స్‌ వరకూ ‘స్టాగ్స్‌ నాట్‌ అలవ్డ్‌’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్‌ఫ్రెండ్‌/గరల్‌ ఫ్రెండ్‌ మిన్న అని భావించడం.

  • పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.

  • చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.

  • ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్‌గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా.  

ఫిర్యాదులు ఇలా..

  • నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత ఫిబ్రవరి 18న  ఈవెంట్‌ ఆర్గనైజర్‌ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్‌ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

  • గత ఏప్రిల్‌ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లివ్‌ ఇన్‌ కపుల్‌ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్‌గఢ్‌ కాగా అబ్బాయిది బీహార్‌ కావడం గమనార్హం.

  • అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్‌ అనే వ్యాపారితో రిలేషన్‌ షిప్‌లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.

  • లివిన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్‌ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్‌ పార్ట్‌నర్‌ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్‌ చేశారు.

  • గతేడాది జూలై 23న ఫిలింనగర్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్‌ శివకుమార్‌ తన లివిన్‌ పార్ట్‌నర్‌తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..
ఏదేమైనా, ఇందులో పార్ట్‌నర్స్‌ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్‌

ఇవి చదవండి: స్పేస్‌–టెక్‌ స్టార్టప్‌ ‘దిగంతర’ రూపంలో సాకారం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement