ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా.. | Adilabad Illegal Affair Incident | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..

Published Mon, Jun 24 2024 11:11 AM | Last Updated on Mon, Jun 24 2024 11:30 AM

Adilabad Illegal Affair Incident

ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఖలీల్‌ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే వారి కాపురం కుప్పకూలింది. భార్యపై అనుమానంతో కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. ఆమె మరణించగా, భర్త కటకటాల పాలయ్యాడు. మృతురాలి పిల్లలతో పాటు మొదటి భార్య, ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు.

ఈ నెల 12న నార్నూర్‌ మండలం నాగలకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్‌ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జిల్లా వ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది.

గతేడాది ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌ కాలనీకి చెందిన ఓ వివాహిత భుక్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. విషయం తెలిసిన భర్త పలుసార్లు మందలించాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్త గుడిహత్నూర్‌ మండలం సీతాగోంది సమీపంలోని గర్కంపేట వద్ద తన బంధువులతో కలిసి హతమార్చాడు. భార్యతో పాటు యువకుడిని సైతం కర్రతో బాది హత్య చేశారు.

ఆదిలాబాద్‌ పట్టణంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో వరుసకు బంధువు అయిన ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబీకులకు తెలియకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫున వారు కోపోద్రిక్తులై గుడిహత్నూర్‌ మండలంలోని డంపింగ్‌ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గతేడాది హతమార్చారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు దారి తీసింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.

జిల్లాలో గతేడాది జరిగిన హత్యలు: 18

ఈఏడాది (ఇప్పటివరకు) జరిగిన హత్యలు:06

ఆదిలాబాద్‌టౌన్‌: వివాహేతర సంబంధాలతో బంధాలు తెగిపోతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడుతుండగా, మరికొంత మంది మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని విలువైన జీవితాలను బలిగొంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్న ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన దంపతులు ఈ సంబంధాల కారణంగా లోకానికే దూరమవుతున్నారు. 

కుటుంబంతో సంతోషంగా ఉంటూ సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన కొంతమంది భార్యభర్తలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారు. వీరి తప్పిదానికి కుటుంబ పరువు వీధిపాలు కావడంతో పాటు పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు విడిపోతుండగా, మరికొందరు తప్పు చేసిన వారిని అంతమొందిస్తున్నారు. దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వీరే కాకుండా ప్రేమలో పడిన జంటలు సైతం ఆఘాయిత్యాలకు పాల్పడుతుండం గమనార్హం.

హత్యలకు ఒడిగడుతున్నారు..
వివాహేతర సంబంధాలతో జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఒకరు రెండో భార్యపై అనుమానంతో హత్య చేయగా.. ఓ ఉపాధ్యాయుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని భర్తనే కడతేర్చింది. ఇంకొంత మంది ప్రేమికులు, కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వారి కుటుంబీకులు, బంధువులు హత్యలకు పాల్పడుతుండగా, దంపతుల్లో ఎవరో ఒకరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. 

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెడుదారులకు ఆకర్షితులై ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తరచూ ఫోన్‌లో మాట్లాడడాన్ని గ్రహించడంతో భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా మద్యం, గంజాయి మత్తులో సైతం కొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన జీవితాలను గాలిలో కలుపుతున్నారు. దంపతుల్లో ఒకరు తప్పు చేస్తే వారిని హతమార్చడానికి పన్నాగం పన్నుతుండగా, ప్రేయసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సైతం వెనుకాడటం లేదు.

ఇష్టం లేకుంటే విడిపోవాలి
దంపతుల్లో చాలా వరకు అనుమానాలతోనే హత్యలు జరుగుతున్నాయి. ఇష్టం లేనప్పుడు విడిపోవడం మంచిది. పోలీస్‌స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చి కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. అవసరమైతే ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కోర్టును ఆశ్రయించాలి. అంతే తప్పా విలువైన ప్రాణాలను తీయడం సరికాదు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
– ఎల్‌.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement