వచ్చే ఐదేళ్లలో రూ.14,130 కోట్లు! | Establishment of FGDs for all thermal power stations | Sakshi
Sakshi News home page

వచ్చే ఐదేళ్లలో రూ.14,130 కోట్లు! 

Published Mon, Jun 5 2023 4:45 AM | Last Updated on Mon, Jun 5 2023 4:45 AM

Establishment of FGDs for all thermal power stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని థర్మల్, హైడల్‌ విద్యుత్‌ కేంద్రాలపై తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) రానున్న ఐదేళ్లలో రూ.14,130.37 కోట్లు ఖర్చు చేయనుంది. నిర్మాణంలోని కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల పూర్తికి, ఇప్పటికే వినియోగంలో ఉన్న థర్మల్, హైడల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులకు ఈ మేరకు వ్యయం చేయనుంది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన 2024–29 పంచవర్ష పెట్టుబడి ప్రణాళికలో ఈ విషయాన్ని జెన్‌కో వెల్లడించింది.

వచ్చే ఐదేళ్లలో మొత్తం 2,83,836.08 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) థర్మల్‌ విద్యుత్, 16,112.84 ఎంయూల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేసింది. జెన్‌కో ప్రతిపాదనలపై ఈ నెల 15 వరకు సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహా్వనించింది. జూలై 5న ఉదయం 11 గంటలకు రెడ్‌హిల్స్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అనంతరం జెన్‌కో సమర్పించిన పెట్టుబడి వ్యయ ప్రణాళికలకు ఆమోదం తెలిపే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.  

ఎఫ్‌జీడీలు తప్పనిసరి         
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్‌ డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, మెర్క్యూరీ వంటి విష వాయువుల కట్టడికి ఫ్లూ–గ్యాస్‌ డిసల్ఫ్యూరిజేషన్‌ (ఎఫ్‌జీడీ) ప్లాంట్లను తప్పనిసరిగా నిర్మించాలని 2015లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కేటీపీఎస్‌ 5, 6వ దశల యూనిట్లకు రూ.1,231.04 కోట్లు, కేటీపీపీ 1, 2 దశల యూనిట్లకు రూ.1,325.75 కోట్ల అంచనాలతో ఎఫ్‌జీడీ ప్లాంట్లను నిర్మించనున్నట్టు జెన్‌కో తెలిపింది. కొత్తగా నిర్మించిన కేటీపీఎస్‌ 7వ దశ, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాలతో పాటు నిర్మాణంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఎఫ్‌జీడీల ప్లాంట్లను ఏర్పాటు చేసే పనులను ఇప్పటికే బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు.  

మణుగూరు, పాల్వంచల్లో భారీ టౌన్‌షిప్‌లు 
మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో తమ సిబ్బంది అవసరాలకు ఈపీసీ విధానంలో సమీకృత టౌన్‌షిప్‌లను జెన్‌కో నిర్మించనుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద రూ.635.63 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ నిర్మించనుంది.

అందులో బహుళ అంతస్తుల నివాస క్వార్టర్లు, ఆస్పత్రి భవనం, పాఠశాల భవనం, క్లబ్‌ హౌస్, అతిథి గృహం, ఇండోర్‌ స్టేడియం, ఆడిటోరియం, స్టోర్స్‌ కాంప్లెక్స్, సెక్యూరిటీ ఆఫీస్‌ బిల్డింగ్, స్టోరేజీ షెడ్, రోడ్లు, డ్రెన్లు, ప్రహరీ గోడల వంటి నిర్మాణాలు ఉండనున్నాయి. కొత్తగూడం పాల్వంచలోని కేటీపీఎస్‌ 7వ దశ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద రూ.524 కోట్లతో బహుళ అంతస్తుల రెసిడెన్షియల్‌ క్వార్టర్లను జెన్‌కో నిర్మించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement