దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే? | T20 World Cup 2024: Whats Wrong With The T20 World Cup Pitches In New York? | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?

Published Sun, Jun 9 2024 9:21 AM | Last Updated on Sun, Jun 9 2024 1:59 PM

whats wrong with the T20 World Cup pitches in New York?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో అస‌లు సిస‌లు స‌మ‌రానికి రంగం సిద్దమైంది.  క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం​ చేసుకున్నాయి.

ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.

ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్ధులైన భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకున్నాయి.  సాధ‌ర‌ణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ  జ‌ట్టు బ‌ల‌మెంత‌? బ‌ల‌హీన‌త‌లు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌ న‌డుస్తుంటుంది. 

కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ వికెట్‌ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అది పిచ్ కాదు.. భూతం
ఈ ఏడాది పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెల‌ల ముందు అమెరికాలోని న్యూయ‌ర్క్‌లో కొత్త‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. 

అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నసావు మైదానం వేదిక‌గా మొత్తం 8 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా,  ఐర్లాండ్‌- కెనడా, దక్షిణాఫ్రికా-నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌లు జ‌రిగాయి. 

ఈ స్టేడియంలోని పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవ‌రికి ఆర్ధం కావ‌డం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

న‌సావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్ప‌టివర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో కెన‌డా చేసిన 137 ప‌రుగులకే అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం.  

పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో  రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. న‌సావు వికెట్ ఎలా ఉందో ఈ గ‌ణాంకాలు చూస్తే మ‌న‌కు అర్ధమ‌వుతుంది.  అస్స‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. ద‌క్షిణాఫ్రికా, భార‌త్ వంటి మేటి జ‌ట్లు కూడా స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

అంతేకాకుండా ఆట‌గాళ్లు గాయాల బారిన కూడా ప‌డుతున్నారు. ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ రాక‌సి బౌన్స‌ర్ వ‌ల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మోచేతికి గాయ‌మైంది.  దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. 

అయితే ఈ పిచ్‌పై రోహిత్ శ‌ర్మ సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉప‌యెగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌  కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement