స్పిన్‌ మ్యాజిక్‌ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..!  | WBBL 2023: Charli Knott Bowls Mysterious Ball To Clean Bowled Sophia Dunkley, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: స్పిన్‌ మ్యాజిక్‌ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..! 

Published Fri, Oct 27 2023 5:41 PM | Last Updated on Fri, Oct 27 2023 6:12 PM

WBBL 2023: Charli Knott Bowls Mysterious Ball To Clean Bowled Sophia Dunkley - Sakshi

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో ఇవాళ (అక్టోబర్‌ 27) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ స్పిన్‌ బౌలర్‌ చార్లీ నాట్‌ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్భేన్‌ హీట్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు చార్లీ నాట్‌ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ బౌల్‌ చేసిన నాట్‌ (రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌).. నాలుగో బంతికి సోఫియా డంక్లీను క్లీన్‌ బౌల్డ్‌ చేసి, బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులంతా అవాక్కయ్యేలా చేసింది.

అక్కడెక్కడో ఆఫ్‌ వికెట్‌ అవతల పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటు వేయడంతో (మిడిల్‌ స్టంప్‌, లెగ్‌ స్టంప్‌కు) ఆశ్చర్యపోవడం అందరివంతైంది. బ్యాటర్‌ అలాగే బంతిని చూస్తూ నిశ్చేష్టురాలిగా మిగిలిపోయింది. బంతి అంతలా మెలికలు తిరుగుతూ మాయ చేయడంతో బౌలర్‌ ముఖంలోనూ వింతహావభావాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పిన్‌ మాయ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నాట్‌ వేసిన బంతిని స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ వేసిన బాల్‌ ఆఫ్‌ ద సెంచరీతో పోలుస్తున్నారు. మొత్తానికి స్పిన్‌ మ్యాజిక్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌​ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్భేన్‌ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రిస్భేన్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా వాల్‌ (48 నాటౌట్‌), చార్లీ నాట్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెల్‌బోర్న్‌ బౌలర్లు సదర్‌ల్యాండ్‌, క్యాప్సీ తలో 2 వికెట్లు.. కిమ్‌ గార్త్‌, ఇల్లింగ్‌వర్త్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌.. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 48 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది. అలైస్‌ క్యాప్సీ (44 నాటౌట్‌) పోరాడుతుంది. బ్రిస్భేన్‌ బౌలర్లలో చార్లీ నాట్‌, నికోలా హ్యాంకాక్‌, జెస్‌ జోనాస్సెన్‌, సారా గ్లెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement