T20 World Cup 2024: భారత్‌ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్‌ ప్లేయర్‌ Naseem Shah walks back in tears after Pakistan's loss to Team India Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్‌ ప్లేయర్‌

Published Mon, Jun 10 2024 10:21 AM

T20 World Cup 2024: Naseem Shah Was Seen In Tears After Pakistan Lost To India

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్‌ 20 ఓవర్లలో 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

తొలుత పాక్‌ పేసర్లు భారత బ్యాటింగ్‌ లైనప్‌కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు చాకచక్యంగా బౌలింగ్‌ చేసి పాక్‌ బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని చేరకుండా కట్టడి చేశారు. 

పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్‌ (4-0-24-2),  సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ (4-0-31-1), అక్షర్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 

భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్‌ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్‌ రిజ్వాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ గెలుపుకు చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్‌ ఓటమి అప్పటికే ఖరారైపోయింది.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో పాక్‌ ఆటగాళ్లు, అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉండింది. యువ పేసర్‌ నసీం షా పాక్‌ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. మ్యాచ్‌ పూర్తయిన అనంతరం పెవిలియన్‌కు వెళ్లే దారిలో షా కన్నీటి పర్యంతమయ్యాడు. అతన్ని షాహిన్‌ అఫ్రిది ఓదార్చే ప్రయత్నం చేశాడు. నసీం కంటితడి పెట్టిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. 

నసీం గతంలోనూ పలు సందర్భాల్లో పాక్‌ ఓడినప్పుడు ఇలానే కంటతడి పెట్టాడు. ఈ మ్యాచ్‌లో నసీం బంతితో (4-0-21-3), బ్యాట్‌తో (4 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు) అద్భుతంగా రాణించాడు. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నసీం పాక్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు.

 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement