Sri Lanka WC Qualifying Chances Suffer Huge Blow After Heavy Defeat In Auckland - Sakshi
Sakshi News home page

WC Super League Standings: శ్రీలంక ఆశలు ఆవిరి.. టాప్‌కు చేరిన న్యూజిలాండ్‌

Published Sat, Mar 25 2023 3:41 PM | Last Updated on Sat, Mar 25 2023 5:05 PM

Sri Lanka WC Qualifying Chances Suffer Huge Blow After Heavy Defeat In Auckland - Sakshi

ఆక్లాండ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 198 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పరుగుల పరంగా శ్రీలంకపై కివీస్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కావాలన్న శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి.

శ్రీలంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తే ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంటుంది. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా న్యూజిలాండ్‌ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఫలితం రాకపోగా.. 15 గెలిచి, ఐదింటిలో ఓడింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి 160 పాయింట్లు చేరాయి.

న్యూజిలాండ్‌ తర్వాత  ఇంగ్లండ్‌ (155), ఇండియా (139), బంగ్లాదేశ్‌ (130), పాకిస్తాన్‌ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్‌ (112) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌-2023కు ఈ 7 జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. మిగిలిన మరో స్థానం కోసం శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లు పోటీపడుతున్నాయి.

సీజన్‌ ముగిసే సమయానికి 8వ స్థానంలో ఉండే జట్టు నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. తొలి వన్డేలో కివీస్‌ చేతిలో భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో శ్రీలంక 10వ స్థానానికి పడిపోయి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఒకవేళ లంకేయులు కివీస్‌పై రెండు, మూడు వన్డేల్లో గెలిచినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ ఛాన్సస్‌ ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుతం స్టాండింగ్స్‌లో ఉన్న 9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. త్వరలో నెదర్లాండ్స్‌తో జరుగబోయే రెండు వన్డేల్లో విజయం సాధిస్తే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం శ్రీలంకతో పాటు 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌, 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్‌ కూడా వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. ఒకవేళ సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయితే వెస్టిండీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌ జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్‌ తదితర జట్లతో కలిసి క్వాలిఫయర్‌ పోటీల్లో తలపడాల్సి ఉంటుంది. ఈ పోటీలు జూన్‌ 8న మొదలవుతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement