BAN vs SL, 2nd Test: బంగ్లాదేశ్‌ను ఊడ్చేసిన శ్రీలంక.. రెండో టెస్ట్‌లో ఘన విజయం Sri Lanka Beat Bangladesh By 192 Runs To Sweep Test Series 2 0 | Sakshi
Sakshi News home page

BAN vs SL, 2nd Test: బంగ్లాదేశ్‌ను ఊడ్చేసిన శ్రీలంక.. రెండో టెస్ట్‌లో ఘన విజయం

Published Wed, Apr 3 2024 4:34 PM | Last Updated on Wed, Apr 3 2024 4:38 PM

Sri Lanka Beat Bangladesh By 192 Runs To Sweep Test Series 2 0 - Sakshi

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో శ్రీలంక.. బంగ్లాదేశ్‌ను వారి సొంత దేశంలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (ఏప్రిల్‌ 3) ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక జట్టు 192 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన యువ ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు​ గెలుచుకున్నాడు. కమిందు ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 122.33 సగటున రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 367 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు లంక ఆటగాళ్లు అర్దసెంచరీలు చేశారు. ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకుండా టెస్ట్‌ల్లో చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే. లంక ఇన్నింగ్స్‌లో నిషన్‌ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్‌ మెండిస్‌ (93), చండీమల్‌ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్‌ (92 నాటౌట్‌) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్‌  3 వికెట్లు పడగొట్టగా.. హసన్‌ మెహమూద్‌ 2, ఖలీద్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మీరజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. లంక బౌలర్లు విజృంభించడంతో 178 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్‌  ప్రభాత్‌ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్‌ హసన్‌ (54) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

భారీ ఆధిక్యంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్ది ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్‌ (56) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఖలీద్‌ అహ్మద్‌ 2, షకీబ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లోలా కాకుండా అద్భుతంగా పోరాడింది.

బంగ్లా బ్యాటర్లు తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్‌ హక్‌ (50), మెహిది హసన్‌ మీరజ్‌ (81 నాటౌట్‌) అర్దసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లహీరు కుమార 4, కమిందు మెండిస్‌ 3, ప్రభాత్‌ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా  శ్రీలంకనే విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement