ఇంగ్లండ్‌తో వార్మప్‌ గేమ్‌.. టీమిండియాతో అశ్విన్‌.. వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చినట్లేనా..? | Ravichandran Ashwin Is With Indian Team For Warm Up Game In Guwahati | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో వార్మప్‌ గేమ్‌.. టీమిండియాతో అశ్విన్‌.. వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చినట్లేనా..?

Published Thu, Sep 28 2023 6:52 PM | Last Updated on Thu, Sep 28 2023 7:06 PM

Ravichandran Ashwin Is With Indian Team For Warm Up Game In Guwahati - Sakshi

భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రపంచకప్‌ జట్టులోకి రావడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్‌ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌లో ఆశ్విన్‌ ఆడటం ఖాయమైపోయిందని సమాచారం. ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఇవాళ (సెప్టెంబర్‌ 28) గౌహతికి చేరగా అశ్విన్‌ జట్టుతో పాటు కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అశ్విన్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి రావడం​ ఖాయమైపోయిందని అభిమానులు అనుకుంటున్నారు. 

కాగా, ప్రపంచకప్‌ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికైన అక్షర్‌ పటేల్‌ గాయపడటం.. ఆసీస్‌తో సిరీస్‌కు అశ్విన్‌‌ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం.. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్‌కు అశ్విన్‌ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి.

తాజాగా ఇంగ్లండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు అక్షర్‌ జట్టుతో కనిపించకపోవడం.. అశ్విన్‌ జట్టుతో పాటు ప్రయాణించడం చూస్తుంటే ప్రపంచకప్‌ జట్టుకు అశ్విన్‌ ఎంపిక లాంఛనమేనని తెలుస్తుంది. మరి సెలెక్టర్లు అశ్విన్‌ను అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తారో లేక యాష్‌ను జట్టుతో పాటు అదనపు సభ్యుడిగా కొనసాగిస్తారో వేచి చూడాలి.

తొలుత అక్షర్‌ వార్మప్‌ మ్యాచ్‌ల సమయానికంతా గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అక్షర్‌ గాయం విషయంలో ఆశించిన పురోగమనం లేకపోవడంతో అతని ప్రత్యామ్నాయంగా అశ్విన్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు తేటతెల్లమవుతుంది. వరల్డ్‌కప్‌ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్‌ 28) ఆఖరి తేదీ కావడంతో మరికాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 14న భారత్‌.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్‌ 30న  ఇంగ్లండ్‌తో.. అక్టోబర్‌ 3న నెదర్లాండ్స్‌తో రోహిత్‌ సేన తలపడుతుంది.

భారత వరల్డ్‌కప్‌ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement