Pakistan Azam Khan: Inspired by Tim David Not Suryakumar Yadav Why - Sakshi
Sakshi News home page

సూర్య కాదు.. ఆ ఆసీస్‌ బ్యాటర్‌ వల్లేనన్న ఆజం ఖాన్‌! ‘స్కై’తో నీకు పోలికేంటి?

Published Mon, Feb 27 2023 3:59 PM | Last Updated on Mon, Feb 27 2023 4:33 PM

Pakistan Azam Khan: Inspired By Tim David Not Suryakumar Yadav Why - Sakshi

Pakistan Super League, 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండర్‌.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు.

తన తండ్రి మొయిన్‌ ఖాన్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్‌ ఇన్నింగ్స్‌తో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్‌.

ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్‌, టీ20 వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు.

సూర్య కాదు.. టిమ్‌ డేవిడ్‌.. ఎందుకంటే
ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్‌ ఫినిష్‌ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్‌ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు.

తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్‌ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్‌ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్‌ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. 

నిజమే నీకు సూర్యతో పోలికేంటి?
ఇక ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్‌! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్‌ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఆజం ఖాన్‌ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ ‍క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు.

చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్‌ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా?
Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్‌ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్‌ ఎగిరిపడింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement