ధోని మాస్ట‌ర్ మైండ్‌.. విరాట్ ఊచకోత! పాక్‌పై ఎన్నో అద్బుతాలు | From MS Dhoni To Virat Kohli: Five Memorable India-Pakistan T20s | Sakshi
Sakshi News home page

T20 WC: ధోని మాస్ట‌ర్ మైండ్‌.. విరాట్ ఊచకోత! పాక్‌పై ఎన్నో అద్బుతాలు

Published Sat, Jun 8 2024 2:01 PM | Last Updated on Sat, Jun 8 2024 2:41 PM

From MS Dhoni To Virat Kohli: Five Memorable India-Pakistan T20s

భారత్‌-పాకిస్తాన్ యుద్దానికి స‌ర్వం సిద్ద‌మైంది. అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ యుద్దం  బోర్డర్‌లో కాదు క్రికెట్ మైదానంలో. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా భార‌త్-పాక్ జ‌ట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.

ఈ మ్యాచ్ కోసం ఇరు జ‌ట్లు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్‌ను మ‌రోసారి చిత్తు చేయాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2021ను మ‌ళ్లీ రీపీట్ చేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది.

అగ్రరాజ్య న‌డిబొడ్డున జ‌రుగుతున్న ఈ దాయదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులు మాత్ర‌మే కాకుండా యావ‌త్తు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఇరు జ‌ట్ల మ‌ధ్యజ‌రిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌ల‌పై ఓ లుక్కేద్దం.

బాల్ అవుట్‌.. ధోని మాస్ట‌ర్ మైండ్‌
ద‌క్షిణాప్రికా వేదిక‌గా 2007లో తొట్ట‌తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా డ‌ర్బ‌న్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే ఈ చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు త‌ల‌ప‌డిన తొలి మ్యాచే అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా  141 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కూడా 141 ప‌రుగులే చేసింది. ఇరు జ‌ట్లు స‌మంగా పోరాడ‌డంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే అప్ప‌టికి సూప‌ర్ ఓవ‌ర్ రూల్ అమ‌లు లేక‌పోవ‌డంతో అంపైర్‌లు మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చేందుకు  బౌల్ అవుట్ ప‌ద్ద‌తిని ఎంచుకున్నారు.  ఈ రూల్ ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షూట్‌ను పోలి ఉంటుంది.

బాల్ అవుట్‌కు అంతా సిద్ద‌మైంది. అంద‌రిలో ఒకటే ఉత్కంఠ.  ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్‌, ఊతప్ప, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హార్భజన్‌సింగ్‌ పేర్లను ప్రకటించగా.. పాక్‌ జట్టు ఉమర్‌గుల్‌, సోహైల్‌ తన్వీర్‌, అరాఫత్‌, షాహిద్‌ అఫ్రిది, అసిఫ్‌లను ఎంచుకుంది.

హార్భజన్‌ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్‌ చేయగా.. పాక్‌ బౌలర్లు యాసిర్‌ ఆరాఫత్‌, ఉమర్‌ గుల్, షాహిద్‌ ఆఫ్రిదిలు విఫలమయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది. 

 ఇక బాల్ అవుట్‌లో భార‌త్ విజ‌యం సాధించ‌డంలో కెప్టెన్ ధోనిది కీల‌క పాత్ర‌.  త్రో చేసే క్ర‌మంలో ప్లేయ‌ర్ల ఏకాగ్ర‌త‌ చెదరకుండా ఉండటం కోసం వికెట్ల వెనుక మోకాళ్ల మీద కూర్చున్నాడు. దీంతో భార‌త ప్లేయ‌ర్లు పాక్‌పై సాధించారు.

ఫైనల్లో ఉత్కంఠ..
ఇక అనుహ్యంగా మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌-పాక్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు పాక్‌పై భారత్ విజయం సాధించింది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్‌ ఆఖరి బంతికి పాక్‌ను ఓడించి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి.  ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ ధోనీ జోగిందర్ శర్మకు అప్పగించాడు. క్రీజులో మిస్బా ఉల్ హక్ ఉన్నాడు.  ఈ క్రమంలో మొదటి బంతిని జోగిందర్ వైడ్ వేయ‌గా.. రెండో బంతిని డాట్ చేశాడు. కానీ మూడో బంతికి మాత్రం భారీ సిక్స్ స‌మ‌ర్పించుకున్నాడు.  

చివరి 4 బంతుల్లో పాక్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. ఈ ద‌శ‌లో స్కూప్ షాట్‌ ఆడిన మిస్బా ఉల్ హక్ షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భార‌త్ తొట్ట‌తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఛాంపియ‌న్స్‌గా నిలిచింది.

విరాట్ కోహ్లి సూప‌ర్ ఇన్నింగ్స్‌..
ఇక పాకిస్తాన్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు అన్ని ఒక ఎత్తు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022లో దాయాదిపై ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎత్తు. 2022లో జ‌రిగిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ విరాట్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 

ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న చోట కోహ్లి త‌న విరోచిత పోరాటంతో టీమిండియాకు సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51), షాన్‌ మసూద్‌ (52) హాఫ్ సెంచరీలు చేయడంతో.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. 

అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 45 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. దీంతో పాక్ విజ‌యం త‌థ్యమ‌ని అంతా భావించారు. కానీ క్రీజులో ఒక పోరాట యోధుడు ఉన్నాడన్న విష‌యం అంద‌రూ మ‌ర్చిపోయారు. 

విరాట్ హార్దిక్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ టీమిండియాను మ్యాచ్‌లో ఉంచాడు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు విజయానికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మయ్యాయి. మ‌హ్మ‌ద్ న‌వాజ్ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌లో పాండ్యా ఔటైనా, విరాట్ కోహ్లీ నోబాల్ ను సిక్స్‌గా మ‌లిచి టీమిండియా డ‌గౌట్‌లో జోష్‌ను నిప్పాడు. ఆ త‌ర్వాత ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశారు. చివరి బంతికి అశ్విన్‌ సింగిల్ తీయ‌డంతో భార‌త్ చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందుకుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement