IND vs WI: Harshal Patel Rates Rohit Sharma & Rahul Dravid Ahead of T20Is - Sakshi
Sakshi News home page

Ind Vs Wi: నీకు మా మద్దతు ఉంటుందని ద్రవిడ్‌ చెప్పారు.. రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..

Published Thu, Feb 3 2022 2:46 PM | Last Updated on Thu, Feb 3 2022 5:17 PM

Ind Vs Wi: Harshal Patel Rates Rohit Sharma Rahul Dravid Ahead T20I Series - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు టీమిండియా బౌలర్‌ హర్షల్‌ పటేల్‌. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హర్షల్‌.. డెబ్యూలోనే ఇరగదీసిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తుది జట్టులోకి తన ఎంపిక సరైందేనని నిరూపించాడు.

ఇక టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు, టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు కివీస్‌తో సిరీసే మొదటిదన్న సంగతి తెలిసిందే. హర్షల్‌కు కూడా అరంగేట్రం కారణంగా ఈ సిరీస్‌ మరింత స్పెషల్‌. ఈ నేపథ్యంలో కెప్టెన్‌, కోచ్‌ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి హర్షల్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతడు...‘‘రోహిత్‌ శర్మ మన చేతికి బంతిని ఇస్తాడు. ఒకవేళ మన పట్ల తనకు నమ్మకం ఉంటే ఏం చేయాలన్న విషయం గురించి చెప్పడు. ‘‘ఏం చేయాలో తెలుసు కదా.. అదే చేసెయ్‌’’ మరి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. నిజంగా తను చాలా మంచి కెప్టెన్‌. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఆడటాన్ని ఎవరైనా పూర్తిగా ఆస్వాదిస్తారు.

ఒకవేళ పరుగులు ఎక్కువగా ఇస్తున్నానని అనిపిస్తే.. నా వద్ద ప్లాన్‌ ఏ, బీ, సీ సిద్ధంగా ఉంటాయి. వాటినిక అమలు చేసేందుకు కెప్టెన్‌ సహకారం ఉంటుంది. నిజంగా రోహిత్‌.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక రాహుల్‌ ద్రవిడ్‌ తనతో మాట్లాడిన విధానాన్ని హర్షల్‌ పటేల్‌ గుర్తు చేసుకున్నాడు. ‘‘మాకు తెలుసు నువ్వు ఆత్మవిశ్వాసం గల బౌలర్‌వి. నువ్వు చేయగలవో.. ఏం చేయాలనుకుంటున్నావో.. చేసెయ్‌. మైదానంలో దిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు.

ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఏదేమైనా నీకు మా మద్దతు ఉంటుంది’’ అని  ద్రవిడ్‌ తనకు భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌ -2021 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన హర్షల్‌ పటేల్‌... 32 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకుని  30 ఏళ్ల 361 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

విండీస్‌తో సిరీస్‌కు భారత టి20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, పంత్, వెంకటేశ్‌ అయ్యర్, దీపక్‌ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్, అక్షర్‌ పటేల్, సిరాజ్, హర్షల్‌ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్‌.    

చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అత‌డికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్య‌ర్‌కి మ‌రీ ఇంత త‌క్కువా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement