T20 WC: ఓవరాక్షన్‌.. బంగ్లాదేశ్‌ పేసర్‌కు ఐసీసీ షాక్‌ Bangladesh's Tanzim Hasan Sakib was fined 15% of his match fees for inappropriate physical contact with Nepal captain Rohit Paudel. Sakshi
Sakshi News home page

T20 WC: ఓవరాక్షన్‌.. బంగ్లాదేశ్‌ పేసర్‌కు ఐసీసీ షాక్‌

Published Wed, Jun 19 2024 9:32 AM | Last Updated on Wed, Jun 19 2024 10:00 AM

ICC Punishes Bangladesh Pacer Sakib Over T20 WC 2024 Match vs Nepal Behaviour

బంగ్లాదేశ్‌ పేసర్‌ తంజీమ్‌ సకీబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి అతడికి గట్టి షాకిచ్చింది.

నేపాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతి చేసినందుకు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం చేయవద్దని హెచ్చరించింది.

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నేపాల్‌తో తలపడింది. కింగ్స్‌టౌన్‌ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది.

సకీబ్‌ అద్భుత బౌలింగ్‌
తద్వారా గ్రూప్‌-డి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించింది బంగ్లాదేశ్‌. ఇక కీలక మ్యాచ్‌లో బంగ్లా గెలుపొందడంలో రైటార్మ్‌ పేసర్‌ తంజీమ్‌ హసన్‌ సకీబ్‌(Tanzim Hasan Sakib)కి ప్రధాన పాత్ర. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులిచ్చి.. 4 వికెట్లు తీసి నేపాల్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు.

అయితే, ఆట పరంగా ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా.. నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు ఈ 21 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌. 

రోహిత్‌ను వెనక్కి నెట్టేశాడు
నేపాల్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో బౌలింగ్‌ చేస్తున్న తంజీమ్‌ రోహిత్‌ పౌడేల్‌ డిఫెన్స్‌ షాట్లు ఆడుతుండటంతో సహనం కోల్పోయి అతడి పైకి దూసుకెళ్లాడు.

కోపంలో రోహిత్‌ను వెనక్కి నెట్టేశాడు తంజీమ్‌. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఇక తంజీమ్‌ దురుసు ప్రవర్తన పట్ల స్పందించిన ఐసీసీ క్రమశిక్షణ చర్యలకు దిగింది.

ఐసీసీ నిబంధనలోని ఆర్టికల్‌ 2.12 ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతున్నపుడు సహచర ఆటగాడు, లేదంటే సహాయక సిబ్బంది, అంపైర్‌, మ్యాచ్‌ రిఫరీ, ప్రేక్షకులు.. ఇలా ఎవరిపట్లనైనా అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు.

తప్పు చేశాడు 
ఇక రోహిత్‌ విషయంలో తంజీమ్‌ సకీబ్‌ తప్పు చేసినట్లు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు అషన్‌ రాజా, సామ్‌ నొగాస్కి.. థర్డ్‌ అంపైర్‌ జయరామన్‌ మదనగోపాల్‌, ఫోర్త్‌ అంపైర్‌ కుమార్‌ ధర్మసేన రిపోర్టు ఇవ్వడంతో ఐసీసీ అతడి ఫీజులో 15 శాతం కోత వేసింది.

కాగా రోహిత్‌ పౌడేల్‌ వికెట్‌ను తంజీమ్‌ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. తంజీమ్‌కు తనకు మధ్య వివాదం అక్కడితోనే సమసిపోయిందని తెలిపాడు. 

అదే విధంగా.. తంజీమ్‌ గొప్పగా బౌలింగ్‌ చేశాడంటూ ప్రశంసించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ సూపర్‌-8లో భాగంగా తదుపరి ఆస్ట్రేలియాతో (జూన్‌ 21) తలపడనుంది.

చదవండి: కెప్టెన్సీకి గుడ్‌ బై.. విలియమ్సన్‌ సంచలన నిర్ణయం.. ఇకపై
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement