Fakhar Zaman Stars As Pakistan Beat New Zealand By 7 Wickets In 2nd ODI, Check Full Score Details - Sakshi
Sakshi News home page

PAK VS NZ 2nd ODI: పాక్‌ ఓపెనర్‌ విధ్వంసం.. 180 నాటౌట్‌, తొలి వన్డేలోనూ శతకం

Published Sun, Apr 30 2023 8:32 AM | Last Updated on Sun, Apr 30 2023 11:07 AM

Fakhar Zaman Stars As Pakistan Beat New Zealand By 7 Wickets In 2nd ODI - Sakshi

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్‌) కదం తొక్కిన జమాన్‌.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు.  జమాన్‌కు జతగా బాబర్‌ ఆజమ్‌ (65), మహ్మద్‌ రిజ్వాన్‌ (54 నాటౌట్‌) రాణించడంతో కివీస్‌ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డారిల్‌ మిచెల్‌ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్‌ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్‌), బోవ్స్‌ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్‌ చేసింది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 4, నసీం షా ఓ వికెట్‌ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్‌ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్‌ జమాన్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ అతనికి సహకరించారు.

ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్‌ (7) విఫలమయ్యాడు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్‌ సోధిలకు తలో వికెట్‌ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్‌ జమాన్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్‌ పర్యటనలో న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement