టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు | Estonia Sahil Chauhan Smashes Fastest T20I Century Of 27 Balls, See More Details Inside | Sakshi
Sakshi News home page

టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు

Published Mon, Jun 17 2024 9:58 PM

Estonia Sahil Chauhan Smashes Fastest T20I Century Of 27 Balls

టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్‌ చౌహాన్‌ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ  స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. 

అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్‌ నికోల్‌ లాప్టీ ఈటన్‌ నమోదు చేసిన ఫాస్టెస్ట్‌ సెంచరీని సాహిల్‌ చౌహాన్‌ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్‌ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్‌పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్‌ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. టీ20 ఫార్మాట్‌ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. గేల్‌ 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. 

తాజాగా సాహిల్‌ గేల్‌ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్‌ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్‌లో) ఓ బ్యాటర్‌ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్‌ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement