రోహిత్‌కు సర్ఫరాజ్‌ తండ్రి రిక్వెస్ట్‌.. రియాక్షన్‌ వైరల్‌ Dhyan Rakhna Sir: Sarfaraz Father Tells Rohit Sharma His Humble Response | Sakshi
Sakshi News home page

Sarfaraz Khan: రోహిత్‌ శర్మకు సర్ఫరాజ్‌ తండ్రి రిక్వెస్ట్‌.. రియాక్షన్‌ వైరల్‌

Published Fri, Feb 16 2024 4:14 PM | Last Updated on Fri, Feb 16 2024 4:41 PM

Dhyan Rakhna Sir: Sarfaraz Father Tells Rohit Sharma His Humble Response - Sakshi

Dhyan Rakhna Sir- Sarfaraz Khan's Father: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులో స్థానం సంపాదించిన భారత యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రంతోనే క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌ అడుగుపెట్టిన ఈ ముంబై ఆటగాడు అర్ధ శతకంతో ఆగమనాన్ని ఘనంగా చాటాడు.

రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో 48 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. సెంచరీకి ఒక పరుగుకు దూరంగా ఉన్న సమయంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పిలుపు మేరకు.. క్రీజును వీడి మూల్యం చెల్లించాడు.

ఫలితంగా 62 పరుగుల వద్ద సర్ఫరాజ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌) ముగిసిపోయింది. అయితే, ఆ తర్వాత జడ్డూ తన తప్పునకు సర్ఫరాజ్‌కు క్షమాపణ చెప్పగా.. అతడు కూడా హుందాగా బదులిచ్చాడు. జడ్డూ భయ్యా ఇచ్చిన ప్రోత్సాహం వల్లే స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించానని పేర్కొన్నాడు.

ఇలా తొలి రోజే ఆటగాడిగా తనదైన మార్కు వేయగలిగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. అయితే, అంతకంటే ముందు.. అరంగేట్రం సందర్భంగా సర్ఫరాజ్‌ కంటే కూడా అతడి తండ్రి నౌషద్‌ ఖాన్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

కుమారులను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అనేక కష్టనష్టాలకు ఓర్చి.. తానే కోచ్‌గా, మెంటార్‌గా ఉన్న నౌషద్‌.. పెద్ద కొడుకు సర్ఫరాజ్‌ను చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. సర్ఫరాజ్‌ అనిల్‌ కుంబ్లే నుంచి టెస్టు క్యాప్‌ అందుకోగానే కన్నీటి పర్యంతమయ్యారు.

క్యాప్‌ను ముద్దాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. నౌషద్‌ ఖాన్‌ పట్ల వ్యవహరించిన తీరు అభిమానుల మనసు దోచుకుంది.

‘‘సర్ఫరాజ్‌ కోసం మీరెన్ని త్యాగాలు చేశారో, ఎంత కఠిన శ్రమకోర్చారో అందరికీ తెలుసు. మీ ఇద్దరికి శుభాకాంక్షలు’’... అని రోహిత్‌.. నౌషద్‌ ఖాన్‌ను అభినందించాడు. ఇందుకు అతడు స్పందిస్తూ.. ‘‘దయచేసి.. మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి సర్‌’’ అని అభ్యర్థించాడు. 

బదులుగా.. ‘‘తప్పకుండా.. మీరేం బాధపడకండి’’ అంటూ హిట్‌మ్యాన్‌ హుందాతనాన్ని చాటుకున్నాడు. అంతేగాకుండా నౌషద్‌ ఖాన్‌ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండి! అన్నట్లు రోహిత్‌ శర్మ అవుట్‌ కాగానే.. అతడి ప్లేస్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రీజులోకి రావడం విశేషం. ఈ సందర్భంగా యువ బ్యాటర్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ హిట్‌మ్యాన్‌ అతడి వెన్నుతట్టాడు.

చదవండి: #Dhruv Jurel: 146 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్‌.. కొడితే సిక్సరే! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement