కార్ఖానాలకు కరెంట్‌ షాక్‌ - | Sakshi
Sakshi News home page

కార్ఖానాలకు కరెంట్‌ షాక్‌

Published Fri, Jun 21 2024 12:40 AM | Last Updated on Fri, Jun 21 2024 12:40 AM

కార్ఖ

ఇవి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌లోని ఆమంచ సదానందంకు చెందిన సాంచాలు. దశాబ్దాలుగా బట్టను నేసిన సాంచాలను ఇలా లారీలోకి ఎక్కించారు. బీవైనగర్‌లో నివసించే సదానందంకు 12 జోడీల సాంచాలు ఉండేవి. మూడు కరెంట్‌ మీటర్లు ఉన్నాయని, ‘సెస్‌’ అధికారులు విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేసి వందశాతం బిల్లులు జారీ చేశారు. దీంతో కరెంట్‌ బిల్లుల బాధను తప్పించుకునేందుకు సదానందం నాలుగు జోడీలు అంటే 8 సాంచాలను రూ.26వేలకు ఒక సాంచా చొప్పున తుక్కు కింద అమ్మేశాడు.

సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఇక్కడి వస్త్రోత్పత్తి రంగానికి అండగా నిలవాలని 23 ఏళ్లుగా ప్రభుత్వాలు సబ్సిడీ కొనసాగించాయి. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీర పరిశ్రమగా గుర్తిస్తూ.. కేటగిరీ–4లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.4కు సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్‌కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు వినియోగించిన ప్రతీ యూనిట్‌కు మరో రూ.2 సెస్‌కు చెల్లించేవారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, విద్యుత్‌ సబ్సిడీ కొనసాగింది. ప్రస్తుతం 2001లో ఇచ్చిన జీఓ ప్రకారం 10 సాంచాలు(అంటే 10 హెచ్‌పీల) వరకే ఈ సబ్సిడీని అందించాలని నిర్ణయించారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్‌పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ అలుగు వర్షిణి ఎల్‌ఆర్‌.ఆర్‌సీ నంబర్‌ 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్‌ను అమలు చేయాలని, 10 హెచ్‌పీల నిబంధన అమలులోకి తేవాలని ఆదేశించారు. ఈ మేరకు సిరిసిల్ల సెస్‌ అధికారులు 10 సాంచాల కంటే ఎక్కువ ఉన్న కార్ఖానాలకు విద్యుత్‌ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్‌కు రూ.7.80 పైసల చొప్పున బిల్లులు వేస్తున్నారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్‌కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేస్తున్నారు.

విద్యుత్‌ వినియోగం తీరిది..

సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో 2023 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 5,074 విద్యుత్‌ సర్వీసుల ద్వారా 25,43,480 యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.50,86,959 విద్యుత్‌ సబ్సిడీ చెల్లించింది. ఈ సర్వీసులన్నీ వస్త్రోత్పత్తికి సంబంధించిన కేటగిరీ–4లో ఉన్నవే కావడంతో సబ్సిడీని భరించింది.

● 2024 ఏప్రిల్‌, మే నెలల్లో 2,229 విద్యుత్‌ సర్వీసుల ద్వారా 8,24,000 యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. దీనికి సంబంధించి రూ.16,48,000 విద్యుత్‌ సబ్సిడీని చెల్లించింది. జౌళిశాఖ అధికారుల ఆదేశాలతో సెస్‌ అధికారులు విద్యుత్‌ బిల్లులను రాయితీ లేకుండా జారీ చేయడంతో విద్యుత్‌ సర్వీసుల సంఖ్య తగ్గింది. విద్యుత్‌ వినియోగం, సబ్సిడీ తగ్గిపోయాయి.

సిరిసిల్లలో నేడు కార్మికుల సమావేశం

సాంచాలు అమ్ముకోవడం, కార్ఖానాలు బంద్‌ పడడంతో ఉపాధి కోల్పోతున్న కార్మికుల సమస్యలపై చర్చించేందుకు గురువారం సిరిసిల్లలో కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సబ్సిడీ రద్దుపై, ప్రభుత్వ వైఖరిపై చర్చంచి ప్రత్యక్ష్యంగా పోరాట పంథాను నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఐటీయూ నాయకులు మూషం రమేశ్‌, కోడం రమణలు వెల్లడించారు.

సబ్సిడీ ఇస్తేనే మనుగడ

అన్ని సాంచాలకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తేనే సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు మనుగడ ఉంటుంది. లేకుంటే ఈ సాంచాలపై అంత విద్యుత్‌ బిల్లు చెల్లిస్తూ వస్త్రోత్పత్తి చేయడం సాధ్యం కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల మూలంగా అన్ని రంగాల లేబర్‌ చార్జీలు పెరిగాయి. కానీ ఆ మేరకు ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న బట్టకు గిట్టుబాటు ధర లేదు. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు.

– నల్ల ప్రదీప్‌,

వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
కార్ఖానాలకు కరెంట్‌ షాక్‌
1/1

కార్ఖానాలకు కరెంట్‌ షాక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement