జగన్‌ వ్యక్తిత్వ హననమే లక్ష్యం: పేర్ని నాని | YSRCP Leader Perni Nani Fires On Chandrababu Naidu And Nara Lokesh Over Fake News On YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌ వ్యక్తిత్వ హననమే లక్ష్యం: పేర్ని నాని

Published Wed, Jun 26 2024 4:23 AM | Last Updated on Wed, Jun 26 2024 1:05 PM

YSRCP Leader Perni Nani Fires On Chandrababu and Lokesh

చంద్రబాబు, లోకేశ్‌ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు.. జగన్‌ భద్రతపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు 

ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇదంతా 

బాబుతోపాటు లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌, భువనేశ్వరికి భద్రత ఇవ్వలేదా? 

హైదరాబాద్‌లోని బాబు ఇంటిలో ఏమున్నాయో ఫొటోలు విడుదల చేయగలరా? 

మీడియాకు ఆ ఇంటిని చూపించగలరా? 

ఉండవల్లిలో కరకట్ట ఇంటికి రూ.వందల కోట్లు ఖర్చు చేయలేదా? 

వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని ధ్వజం  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా నిత్యం విష ప్రచారాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే జగన్‌ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్‌కు సైతం 4+4తో భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. మరి ఇప్పుడు జగన్‌ భద్రతపై ఎందుకు ఇంత విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుకు ఎంతమందితో భద్రత కల్పిస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని రామోజీ కుమారుడు కిరణ్‌ని నిలదీశారు. జగన్‌కు మొత్తం 196 మందితో మాత్రమే భద్రత కల్పిస్తుంటే 986 మంది అని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీగా ఉన్నప్పుడు ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారో.. వారి జీతాలు ఎంతో బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. సుమారు 1,800 నుంచి 2,000 మందిని భదత్రకు సెక్యూరిటీని నియమించుకోలేదా? అని నిలదీశారు. 

జగన్‌ ఉంటున్న తాడేపల్లి నివాసంపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫొటోలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని జగన్‌ ఇంటిలో, హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని సవాల్‌ విసిరారు. మీడియాకు జూబ్లీహిల్స్‌ ఇంటిని చూపించగల దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

జగన్‌ నివాసంపైనా తప్పుడు ప్రచారాలేనా?
ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయి విజయవాడ వచ్చారు. కరకట్ట ఇంటికోసం రోడ్లు, హెలీప్యాడ్, టవర్ల రూపేణా వందల కోట్లు ఖర్చు చేశారు. పార్టీ ఆఫీసులకు స్థలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది కూడా చంద్రబాబే. 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వాల్సి ఉండగా 99 ఏళ్లకు లీజు పెంచుకున్నారు. టీడీపీ కట్టుకున్న ఆఫీసులు.. పూరిపాకలు, గుడిసెలు కాదు. మీలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకున్న వారితో మేం ఆఫీసులు కట్టించుకోలేదు.. పార్టీ డబ్బుతో కట్టుకుంటున్నాం. 

టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను రామోజీరావు కుమారుడు కిరణ్‌ తన పత్రికలో రాయగలరా? జగన్‌ బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎదురొడ్డి ధైర్యంగా రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్‌. భయపడటం ఆయనకు తెలియదు. చంద్రబాబు, సోనియాగాంధీ చీకట్లో కలుసుకుని 16 నెలలు జైల్లో పెడితే ఏమైనా తగ్గారా? ఓడిపోతే తగ్గుతారా? జగన్‌ మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.

ఇంత దుర్మార్గపు రాతలా?
కొన్ని ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలతో ప్రజల మనసుల్లో విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ల లక్ష్యం నెరవేరాక కూడా ఈ దుర్మార్గపు రాతలను ఆపకపోవడం వాళ్ల కిరాతక మానసిక నైజానికి అద్దం పడుతోంది. రామోజీరావు లేరనుకుంటే ఆయన కుమారుడు కిరణ్‌ ఈనాడులో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. జగన్‌ రక్షణకు 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంత మంది.. బయటకెళ్తే దీనికి రెండు మూడింతలు.. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు అని అసత్యాలను ఎలా ప్రచురిస్తారు? తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసును ప్యాలెస్‌ అని లోకేశ్‌ మాట్లాడుతున్నారు. 

ఆయన ఎర్రబుక్కు రాసింది నిజమైతే, ఖలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే.. వారి జూబ్లీహిల్స్‌ ఇంటికి మీడియా టూర్‌ పెట్టాలి. లేదా రిటైర్డ్‌ జడ్జితో ఆ ఇంటికి విలువ కట్టించాలి. చంద్రబాబు తన రాజ్యకాంక్ష కోసం ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జగన్‌ వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా వ్యక్తిత్వహననం చేయిస్తున్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీసులో ఫర్నీచర్‌ గురించి మాట్లాడుతున్నారు.. బాబు ఆఫీసులో ఫర్నీచర్‌ ఎవరు వేశారో లెక్కలు తీయాలి. మీకో న్యాయం.. జగన్‌కో న్యాయమా?

చంద్రబాబు ఇంటి రోడ్డును బ్లాక్‌ చేయలేదా?
మొన్నీమధ్య తాడేపల్లిలోని రోడ్డును మూసేశారంటూ రాశారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉండవల్లిలో లోటస్‌ హోటల్‌ నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా కరకట్ట రోడ్డులో జడ్జిలను తప్ప ఎవరినైనా వెళ్లనిచ్చారా? చివరకు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆ రోడ్డులో ప్రవేశం లేదు.  

మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఊర్లకు లోపలి నుంచి చుట్టూ తిరిగి రావాల్సిందే కదా. నాడు మొత్తం 13 కిలోమీటర్లు రోడ్డు మూసేశారు. తాడేపల్లిలో జగన్‌ ఇంటి చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లు ఉన్నాయి కాబట్టే ఐరన్‌ గ్రిల్‌ ఏర్పాటు చేశారు. ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఓనర్లు ఇకనైనా ఈ అసత్య కథనాలను ప్రచురించడంమానుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement