పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా? | Why Is Chiranjeevi Not Campaigning For Pawan Kalyan In Pithapuram Ahead Of Andhra Pradesh Elections 2024 | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?

Published Sat, May 11 2024 3:24 PM | Last Updated on Sat, May 11 2024 3:52 PM

Why Is Chiranjeevi Not Campaigning For Pawan Kalyan

జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్  కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు.  ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో  జనసేన నాయకుడు పవన్ కల్యాణ్  భీమవరం, గాజువాక నియోజక  వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు  ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.

తన ఓటమికి కారణాలపై  పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని  శ్రేయోభిలాషులు  అప్పట్లోనే  సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని  బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే  చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన  ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.

ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున  ఎంపీ వంగా గీత  పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.

అందరూ చేస్తున్నారు కానీ  పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య  మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని  పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే  పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి  పవన్  గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో  చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి  విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై  చర్చ జరుగుతోంది.

విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో  పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే  ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement