ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా? | There is uncertainty over the conduct of local body elections | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?

Published Thu, May 30 2024 6:30 AM | Last Updated on Thu, May 30 2024 6:30 AM

There is uncertainty over the conduct of local body elections

జూన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం ప్రకటన

బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ఖరారుపై ఇంకా మొదలు కాని బీసీ కమిషన్‌ కసరత్తు 

జనాభా గణన సుదీర్ఘకాలం సాగే అవకాశం 

ఓటర్ల జాబితా ప్రకారమైనా ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లోనే 

స్థానిక ఎన్నికల నిర్వహణకు అవకాశాలు 

జనవరి చివర్లోనే ముగిసిన గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం

జూలై మొదటి వారంతో ముగియనున్న జిల్లా, మండల పరిషత్‌ల కాలపరిమితి

సాక్షి, హైదరాబాద్‌: ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక.. జూన్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. స్థానికంగా (క్షేత్రస్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు సాగుతున్నాయి. 

జూన్‌ 6వ తేదీ వరకు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ఉండడంతో ప్రభుత్వం లేదా బీసీ కమిషన్‌ పరంగా...  స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు.  గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా... జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్‌ పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదేవిధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది. 

బీసీలకు 42% స్థానిక రిజర్వేషన్లపై హామీ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచి్చంది. ఈ మేరకు బీసీ కమిషన్‌ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్‌ టెస్ట్‌’ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. 

స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్‌ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం పేర్కొంది.  ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్‌  చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్‌ టెస్ట్‌ మేరకు  క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. 

కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన జాబితా) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలను నోడల్‌ ఏజెన్సీలుగా నియమించి.. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్‌ భావిస్తున్నట్టు కమిషన్‌ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగానా? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం. 

ఈ కసరత్తు జరిగితే...ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్నికలు? 
ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని,  సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్‌ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. 

ఒకవేళ ఈ ఆలోచనకు ప్రభుత్వపెద్దలు ఓకే చెబితే రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు పంపిస్తే ఆగస్‌ చివర్లో లేదా సెప్టెంబర్‌లో ముందుగా గ్రామపంచాయతీ ఆ తర్వాత జిల్లా, మండలపరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించుకోవచ్చుపనని అభిప్రాయపడుతున్నారు. 

కొత్త కమిషన్‌ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారా? 
ఈ ఆగస్టుతో బీసీ కమిషన్‌ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ పరిస్థితుల్లో పాత కమిషన్‌ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన కసరత్తును పూర్తిచేసి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళుతుందా ? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్‌ ద్వారానే ఈ కార్యాచరణను నిర్వహిస్తారా అన్నది కూడా అధికారవర్గాల్లో చర్చకు వస్తోంది. ఆగస్ట్‌లో కొత్తగా బీసీ కమిషన్‌ చైర్మన్, సభ్యులను నియమించాక... బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మాత్రం ఈ ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. 

దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి ?  ముందుగా జీపీ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే... తొలుత జీపీ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement