కమలాన్ని ఆ ఇద్దరే ముంచారా..? | telangana bjp graph down because of two leaders | Sakshi
Sakshi News home page

కమలాన్ని ఆ ఇద్దరే ముంచారా..?

Published Sun, Nov 5 2023 8:32 PM | Last Updated on Sun, Nov 5 2023 9:13 PM

telangana bjp graph down because of two leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాయకుల వల్ల పార్టీకి మేలు జరుగుతోందా? పార్టీ వల్ల నాయకులు లబ్ది పొందుతున్నారా? పార్టీకి ఇమేజ్ పెరిగితే లాభ పడేది ఎవరు? నాయకులకు పేరొస్తే ఎవరికి లాభం చేకూరుతుంది? ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకుల వ్యవహారంపై హాట్‌ హాట్‌గా అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారే ఎందుకు చర్చనీయాంశాలుగా మారారు? కాషాయసేనకు తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందినవారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు ముఖ్యమైన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 బండి సంజయ్‌ రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే కొనసాగుతోంది. ఈటల రాజేందర్‌ కొంతకాలం క్రితం గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ధిక్కరించి కమలం పార్టీ తరపున మళ్ళీ హుజూరాబాద్‌నుంచి అసెంబ్లికి ఎన్నికయ్యారు. అయితే ఇద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల అగాధం తెలంగాణ బీజేపీని ఓ కుదుపు కుదుపుతోంది. ఈటల వచ్చాకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్‌కు దూరమైందనే చర్చలు సాగుతున్నాయి. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ డీలా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎఫెక్ట్‌ ఇంకా పార్టీని వీడకపోగా..కాంగ్రెస్ ను కాదని సెకండ్ ప్లేస్ కు వచ్చి కారు పార్టీని ఢీకొట్టే స్థాయికి చేరిన కమలం పార్టీ..ఇప్పుడు మూడోస్థానంతో డీలా పడిపోవడంతో.. పార్టీలో అంతర్గతంగా ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అనుకుని కమలం బాట పట్టిన ఈటల.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు మారాయి. ఇద్దరు నేతలు బాహాటంగానే ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం..ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రస్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత అడ్వాంటేజ్ గా తీసుకోవడం వంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండికి అప్పటికే నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వంటివాళ్ళతో పొసగకపోవడం వంటి ఎన్నో కారణాలు, సంఘటనలు అన్నీ కలిసి..బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా చేశాయి. కొందరు నేతల మాట విన్న ఢిల్లీ పెద్దలు బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో...బీజేపీ గ్రాఫ్ మొత్తం వేగంగా పడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ఈటల రాజేందర్‌ పార్టీలో చేరికే ప్రధాన కారణమనేవారూ కొందరు తయారయ్యారు. దీంతో ఈటల చేరిక ఇప్పుడు బీజేపీకి ప్లస్సా..?మైనస్సా..అనే చర్చకు తెరలేపింది.

బండి సంజయ్ విషయానికొస్తే.. మూడుసార్లు కరీంనగర్‌లో కార్పోరేటర్ గా పనిచేసి.. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని కరీంనగర్ నుంచే ఎంపీగా గెల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబట్టినప్పటినుంచీ పరుగులు తీయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్‌లో ఒక కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ హయాంలో.. బండి సంజయ్ తర్వాత.. బీజేపీ ఎలా ఉందనే స్పష్టమైన గ్రాఫ్ ను జనం ముందు బండి ఉంచారు. బండి హయాంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనే టాక్ కమలం శ్రేణుల్లో తీసుకురాగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని..తెలంగాణలో గాని ఎవరికీ రానంత క్రేజ్‌తో ఓ సక్సెస్ ఫుల్ రథసారధిగా పేరు తెచ్చుకున్నారు బండి సంజయ్‌. 

ఇదే సమయంలో పార్టీలో వచ్చిన ఈ పేరును కాపాడుకోవడంలో మాత్రం సంజయ్ వైఫల్యం చెందాడనేవారూ ఉన్నారు. అందరినీ కలుపుకోలేకపోవడం.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో క్లారిటీ లేకపోవడం.. చేయకూడనివి చేయడం, చేయాల్సినవి చేయకపోవడం.. మీడియా ముందు ఆచితూచి మాట్లాడాల్సిన చోట తప్పటడుగులు వేయడం వంటివన్నీ.. పార్టీలోని ఆయన అంతర్గత ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అప్పటికే పార్టీ అంతర్గత ప్రథమ ప్రత్యర్థిగా తయారైన ఈటల రాజేందర్‌తో పాటు..బండి అంటే పడనివారంతా ఏకమై ఆయనపైకి తమ వద్ద ఉన్న అస్త్రాలను ఎక్కుపెట్టడంతో.. బండి పదవి ఊడిందనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్‌ సారథిగా ఉన్నంతకాలం ఒక బూమ్ తో కనిపించిన బీజేపి ఎదుగుదల పాలపొంగులా పడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందనే ప్రచారం జరుగుతోంది.
 
ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పుంజుకోవడం అంటే అంత సులభంగా జరిగేది కూడా కాదు. కానీ, బండి సారథ్యంలో బలంగా తయారైన పార్టీని, అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీగా తయారైన పార్టీని.. అందరూ కలిసి నిండా ముంచేశారన్నది ఇప్పుడు వినిపించే టాక్. దీంతో ఈటల చేరిక.. సంజయ్ అధ్యక్ష పదివి నుంచి దిగిపోవడం.. రెండూ పార్టీకి మేలు కంటే నష్టాన్నే చేకూర్చాయనే చర్చోపచర్చలకు తెరలేచింది. మరిప్పుడు మునిగిపోతున్న బీజేపీ నావను.. తిరిగి గట్టెక్కించే అవకాశం అసలుందా...? మరి ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందమేనా..? లేక కీలక నేతలైన బండి, ఈటల వైరమే.. పుట్టి ముంచిందా అనే భిన్నరకాల విశ్లేషణలు జనం మధ్య జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement