Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు | TDP Leader Ganta Srinivasa Rao Fouce On Bhimili Lands | Sakshi
Sakshi News home page

Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు

Published Sat, Apr 13 2024 7:50 AM | Last Updated on Sat, Apr 13 2024 7:50 AM

TDP Leader Ganta Srinivasa Rao Fouce On Bhimili Lands - Sakshi

భూములపై కన్నేసిన గంటా గ్యాంగ్‌ 


భూచోళ్లంతా ఏకమవుతున్నారు 

2014 నుంచి 2019 మధ్య కాలంలో కబ్జాలకు పాల్పడిన గంటా అండ్‌ కో 


మళ్లీ భూకబ్జారాయుళ్లనంతా పోగేస్తున్న సూత్రధారి 


ఇప్పటికే గంటా పంచన చేరిన గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణం 


ఐదేళ్లలో రూ.1500 కోట్ల విలువైన భూములు మింగేసిన గంటా బ్యాచ్‌ 

సాక్షి, విశాఖపట్నం : భీమిలి భయపడుతోంది.. 2014 నుంచి ఐదేళ్ల పాటు వారి చెరలో చిక్కుకున్న భూమాత మళ్లీ.. చిగురుటాకులా వణికిపోతోంది. భూచోళ్లు అంతా కలిసి వస్తున్నారని సంకేతాలతో జనం గుండెలు అదురుతున్నాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అక్రమార్కులు అధికారం అండ ఉన్న బంధువులు కుమ్మక్కై కనిపించిన జాగాలన్నీ కబ్జా చేసిన ఘనులకు సూత్రధారిగా నిలిచిన గంటా శ్రీనివాసరావు కన్ను ఇప్పుడు భీమిలిలో మిగిలిన భూములపైనా పడింది. అందుకే పట్టుబట్టి మరీ భీమిలి టికెట్‌ సాధించి ఇప్పుడు భూ కబ్జారాయుళ్లనంతా పోగేసుకుంటున్నారు.  

ఒకప్పుడు దేశంలోనే రెండోదిగా, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి పురాతన మున్సిపాలిటీగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత భీమిలికి 2014–19 కాలంలో కొత్త పేరుని తీసుకొచ్చారు గంటా అండ్‌ కో. కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ, భీమిలికి ఉన్న మంచి పేరుని కాస్తా చెరిపేసి.. భూకబ్జాల భీమిలిగా మార్చేసి.. నియోజకవర్గ పరువుని బంగాళాఖాతంలో కలిపేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా ఆక్రమించిన భూముల లెక్క రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సహజంగా ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా నిజమైనా... అనిపిస్తుంది.. కానీ ఆయన అల్లుడుతో పాటు బినామీలు, టీడీపీ తోడేళ్లు ఐదేళ్ల పాటు ఇదే పనిలో ఉండి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేశారనేది ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా బయటకు వచ్చే వాస్తవం. వాటిలో కొన్ని మచ్చుకు పరిశీలిద్దాం..

సీలింగ్‌ భూముల కథ ఇదీ.. 
నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్‌ భూములను చుట్టేసేలా గంటా అండతో అతని అల్లుడు, బినామీలు కలిసి భూదందా చేశారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973 ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. 1975వ సంవత్సరంలో ఆయన  ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్‌ సీలింగ్‌ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్‌ తీర్పు (ఎల్‌సీసీ 230బై75) ఇచ్చింది. ఈ మేరకు విశాఖ రూరల్‌ మండలం మధురవాడలో సర్వే నంబర్‌ 262/4, 263/æ2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1కి సంబంధించి 28.84ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అప్పగించారు.

ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగినా కోరాడ వెంకటస్వామినాయుడు మృతి తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను సైతం అడ్డగోలుగా విక్రయించేశారు. మధురవాడ పంచాయతీ పరిధిలో ఇచ్చిన 28.84ఎకరాల భూమిని కోరాడ వారసులు కృష్ణా కో–ఆపరేటివ్‌ సొసైటీకి విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పటి చినగదిలి ఎమ్మార్వో ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించేశామని, అందుకు బదులుగా తమకు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80ఎకరాల (సర్వే నంబర్లు 39/1, 39/2) భూమిని అప్పజెబుతామని కోర్టును అభ్యరి్థంచారు. 

ఈమేరకు కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేసి ఆ భూమిని స్వా«దీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు. దీంతో ఆ వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్ని ఎకరాలను 2006లో విక్రయించేశారు. సర్వే నంబర్‌ 39/1, 39/5ఏలో 11.8ఎకరాల భూమిని విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14ఎకరాల భూమిని తిరిగి గారిపేట వాస్తవ్యుడు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నంబర్‌ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. మళ్లీ 263/æ2 లోని 0.34ఎకరాల భూమిని అమ్మేశారు. 

మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. ఇంకా తాము 11.14ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14ఎకరాల భూపంపిణీకీ ఇంకో మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు  రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి 1:2 ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలను మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమి కూడా నర్సీపట్నం పరిసరాల్లోని భూములను ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కన కల్లాలు గ్రామంలోని 11.14ఎకరాల భూమిని తమకు మినహాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ జిల్లాకోర్టులో కేసు వేశారు.  

అల్లుడు రంగప్రవేశంతో.. 
కోర్టు విచారణ పూర్తికాకున్నా ఈలోగా గంటా అల్లుడు రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, అల్లుడికి మధ్య టీడీపీ నాయకులు కోరాడ నాగభూషణం, గాడు వెంకటప్పడు, ఇతర నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. అధికారికంగా పేర్కొంటున్న 11.14ఎకరాలతో సహా తొక్కిపెట్టిన  30ఎకరాలపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా వీళ్లే పంచేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు.. గంటా భీమిలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ వెలగబెట్టకపోయినా.. అడ్డగోలు సంపాదనకు మాత్రం తెరతీశారు. అనుచరగణంతో కలిసి భూ దందాలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.కోట్ల రుణాలు పొందినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. వెలుగులోకి రాని భూబాగోతాలెన్నో..

మళ్లీ.. అదే గ్యాంగ్‌తో హల్‌ చల్‌.! 
భీమిలిలో గంటా గ్యాంగ్‌ చేసిన అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని భూ కబ్జాల కేంద్రంగా మార్చిన గంటాకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రజలంతా డిసైడైపోయారు. విషయం తెలుసుకున్న గంటా.. నియోజకవర్గం నుంచి పారిపోయి ఉత్తరం పంచన చేరారు. ఆయన అనుచరగణం.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వేరైపోయారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని భావించిన గంటా.. తిరిగి భీమిలికి చేరుకున్నారు. వచ్చిందే తడవుగా.. తన కబ్జాల అనుచరగణాన్ని చేరదీసుకుంటున్నారు. టీడీపీలో సస్పెండ్‌కు గురైన కబ్జా గ్యాంగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసేస్తూ.. మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.

 గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణరావు తదితర బ్యాచ్‌ను పోగేసుకుంటున్నారు. గంటా బాబా.. అరడజను దొంగల మాదిరిగా..  దొంగల ముఠా అంతా ఒక చోట చేరుతుండటంపై భీమిలి ప్రజలు మళ్లీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇంక ఆక్రమించేందుకు ఏమున్నాయని వాపోతున్నారు. అయినా డబ్బులు ఎరవేసి, భయపెట్టి.. బెదిరించి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న గంటా.. గెలిస్తే భీమిలిలో ఉన్న కొద్ది పాటి భూములను సైతం తన గ్యాంగ్‌తో కలిసి కాజేయ్యాలన్న కుట్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అందలం ఇస్తే.. భీమిలిని సర్వనాశనం చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement