ఏజెంట్లే కీలకం The role of counting agents is crucial in the counting of votes | Sakshi
Sakshi News home page

ఏజెంట్లే కీలకం

Published Mon, Jun 3 2024 4:09 AM | Last Updated on Mon, Jun 3 2024 4:09 AM

The role of counting agents is crucial in the counting of votes

ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి 

ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం ఉండాలి 

ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి 

అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి 

తుది ఫలితం ప్రకటించే దాకా హాల్‌ విడిచి వెళ్లకూడదు 

కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు  

ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి  

సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ముహూర్తం సమీపించడంతో కౌంటింగ్‌ ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ఈ ప్రక్రియపై పూర్తి అవగా­హ­నతో పాటు నిబంధనలపై పట్టున్న వ్యక్తు­లను ఎంపిక చేసి రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. కౌంటింగ్‌ హాళ్లలో టీడీపీ ఘర్ష­ణలకు దిగి ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళి­కలు రూపొందించినట్లు స్పష్టమవుతు­న్నందున వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచిస్తు­న్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని పేర్కొంటున్నారు. 

టీడీపీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమా­నాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లదే కాబట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్‌ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వ­కంగా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్‌మెంట్‌ (ధ్రువీకరణ) పత్రం  తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. 

నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదు కాబట్టి ప్రతీది లిఖితపూర్వకంగా తెలియచేయడం తప్పనిసరి. వీవీ ప్యాట్‌లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్‌గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

రీ కౌంటింగ్‌ హక్కు 
లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి రౌండ్‌లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలి. లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీ­కరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు కౌంటింగ్‌ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.

కౌంటింగ్‌లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్‌ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానున్నందున ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్‌గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement