‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ: ప్రధాని నరేంద్ర మోదీ PM Narendra Modi Fires On Congress Party | Sakshi
Sakshi News home page

‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ: ప్రధాని నరేంద్ర మోదీ

Published Tue, Jun 25 2024 1:02 AM | Last Updated on Tue, Jun 25 2024 1:02 AM

PM Narendra Modi Fires On Congress Party

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటు

దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్తతరం మర్చిపోదు  

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి  

ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు  

వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత మూడురెట్లు పెరిగింది  

ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి  

సభలో నినాదాలు కాదు.. అర్థవంతమైన చర్చలు జరగాలి  

‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి  

సాక్షి, న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ నాటి రోజులు భారతదేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ పాలనకు మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించి, దేశాన్ని జైలుగా మార్చిన ఆ రోజులను దేశంలోని కొత్తతరం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకొనేందుకు పౌరులంతా తీర్మానం చేయాలని కోరారు. 

తద్వారా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం సామాన్య ప్రజల కలలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 18వ లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చామని, తమ ప్రభుత్వ బాధ్యత మూడు రెట్లు పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. 

ప్రభుత్వం గతంలో కంటే మూడు రెట్లు కష్టపడి పనిచేస్తుందని, మూడు రెట్లు ఫలితాలను తీసుకొస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ‘‘ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఇదొక గర్దించదగ్గ, అద్భుతమైన రోజు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత తొలిసారి నూతన పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలకు నా అభినందనలు. 

సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కొత్త ఉత్సాహంతో సరికొత్త శిఖరాలను అధిరోహించేందుకు ఇదొక సువర్ణావకాశం. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ అనే లక్ష్య సాధనకు మనమంతా కలిసి పనిచేద్దాం. అభివృద్ధి చెందిన భారత్‌ అనే సంకల్పాన్ని నెరవేర్చడానికి, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మనం చేతులు కలపాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.  

ఏకాభిప్రాయంతో ముందుకు.. 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ అవసరం అయినప్పటికీ, దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఏకాభిప్రాయం చాలా ముఖ్యమని తాము విశ్వసిస్తున్నానని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా ఇదే సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నించామన్నారు. 140 కోట్ల మంది పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ ఏకాభిప్రాయం సాధించడం ద్వారా దేశానికి సేవ చేయాలనేది తమ ప్రభుత్వ ప్రయత్నమని పేర్కొన్నారు. 

ఇదే సమయంలో 18వ సంఖ్య ప్రాముఖ్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘18వ లోక్‌సభలో చాలామంది యువ ఎంపీలు ఎన్నికయ్యారు. భారతీయ సంప్రదాయాల ప్రకారం 18 సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. భగవద్గీతలో కర్మ, కర్తవ్యం, కరుణ సందేశాన్ని అందించే 18 అధ్యాయాలు ఉన్నాయి. పురాణాలు, ఉప పురాణాల సంఖ్య 18. దీనికితోడు దేశంలో చట్టపరమైన ఓటింగ్‌ వయస్సు 18 ఏళ్లు. అమృతకాల సమయంలో 18వ లోక్‌సభ ఏర్పాటు కావడం శుభసూచకం’’ అని అన్నారు.  

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి  
ప్రతిపక్షాల బాధ్యతను ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడుతూ, ప్రతిపక్షాలు వారి పాత్రను పూర్తిస్థాయిలో పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో నినాదాలకు బదులు అర్థవంతమైన చర్చలను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎంపీలందరూ సామాన్య ప్రజల అంచనాలను
అధిగమించేందుకు ప్రయత్నించాలని మోదీ సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement