ఇలా రాజీనామా, అలా ప్రమాణం! Bihar political crisis: All eyes on Nitish Kumar as political storm brews in Bihar | Sakshi
Sakshi News home page

Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం!

Published Sun, Jan 28 2024 4:56 AM | Last Updated on Sun, Jan 28 2024 6:53 AM

Bihar political crisis: All eyes on Nitish Kumar as political storm brews in Bihar - Sakshi

పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్‌ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్‌ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది.

బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్‌ అవామీ లీగ్‌ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం.

మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సెల్‌ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్‌ కావడం వాటిని బలపరుస్తోంది!

దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘెల్‌ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

ఇక ఘట్‌బంధన్‌ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్‌ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్‌ పొలిటికల్‌ డ్రామా నడిచింది.

ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ)
బిహార్లో ఘట్‌బంధన్‌ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement