తొలిరోజు బోణీ ఒకటి! | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు బోణీ ఒకటి!

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

● ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ● స్వతంత్ర అభ్యర్థిగా జయరాజు నామినేషన్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి అడుగుపడింది. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్‌కుమార్‌ గురువారం విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. తొలిరోజు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక నామినేషన్‌ దాఖలైంది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా కురుపాం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్వో వీవీ రమణకు ఒక సెట్‌ నామినేషన్‌ను అందజేశారు. ఆయన కురుపాం అసెంబ్లీ స్థానంతోపాటు, అరకు ఎంపీ స్థానానికి కూడా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఏకాదశి కావడంతో వైఎస్సార్‌సీపీ కురుపాం అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి, సాలూరు అభ్యర్థి పీడిక రాజన్నదొర నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కూటమి అభ్యర్థులు 20వ తేదీ నుంచి 24వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామి నేషన్‌ ఉపసంహరణకు 29న మధ్యాహ్నం 3 గంట ల వరకు అవకాశం కల్పించారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 13వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లను స్వీకరించేందుకు పార్వతీపురం కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేశారు. పాలకొండ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంగా రెవెన్యూ డివిజ నల్‌ కార్యాలయం, సాలూరు, కురుపాం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా తహసీల్దా ర్‌ కార్యాలయాలను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలుగా నిర్ణయించారు. ఆ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కింపు

నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో గురువా రం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను వారి ఖాతాలో నమోదు చేస్తా రు. పత్రికల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌, ప్రకటనలు, వార్తలను సైతం వారి ఖాతాల్లోనే లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చుపెట్టొచ్చు.

గిరిజన గ్రామాల్లో పోలీసుల కవాతు

మక్కువ: మండలంలోని గిరిజన గ్రామం నందలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు పోలీసులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేర కు ఎస్సై పి.నరసింహహమూర్తి ఆధ్వర్యంలో ఆర్‌పీఎఫ్‌ బలగాలు గ్రామంలో పర్యటించాయి. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. గ్రామంలో మద్యం విక్రయించరాదని, ఎటువంటి సమాచారం తెలిసిన పోలీసులకు తెలియజేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement