ప్రలోభాల పన్నాగం | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పన్నాగం

Published Mon, May 6 2024 7:05 AM | Last Updated on Mon, May 6 2024 9:04 AM

-

భారీగా డంప్‌ చేసిన మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత అనుచరులు

పక్కా సమాచారంతో పట్టుకున్నఎస్‌ఈబీ పోలీసులు

రూ. 30లక్షల విలువైన 400కేస్‌లు స్వాధీనం

పోలీసుల అదుపులో నలుగురు టీడీపీ కార్యకర్తలు

జి.కొండూరు: టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్‌ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే నాయకులను తన వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్న వసంత, ఓటర్లను సైతం ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో డబ్బు పంపిణీ చేసేందుకు 2వేల మంది తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులను రంగంలోకి దింపిన వసంత, ఇప్పుడు మద్యాన్ని సైతం పంపిణీ చేసేందుకు తన అనుచరులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి మద్యం బాటిళ్లను రవాణా చేస్తూ వసంత వెంకటకృష్ణప్రసాద్‌ అనుచరులు ఐదుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు పట్టుబడ్డారు.

దొరికారు ఇలా..
మైలవరం నియోజకవర్గంలోకి భారీగా తెలంగాణ మద్యం సరఫరా అవుతోందని ఉన్నతాధికారుల సమాచారం మేరకు మైలవరం డివిజన్‌ అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సి. భార్గవ నేతృత్వంలో ఎస్‌ఈబీ సీఐ నాగవవల్లి, మైలవరం డీటీపీ ఎస్‌ఐ ఎల్‌. రమాదేవి, ఎస్‌ఐ సుబ్బిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మైలవరం మండల పరిధి అనంతవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వసంత వెంకటకృష్ణప్రసాద్‌ ప్రధాన అనుచరుడు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులు మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనంలో తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి తరలిస్తున్న 150కేస్‌ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెడ్డిగుంటలో భారీ డంపు స్వాధీనం..
ఈ ఐదుగురు నిందితులను విచారించిన అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటలోని చేబ్రోలు కృపారాజుకి చెందిన మామిడితోటలో భారీగా డంపు చేసిన 250కేస్‌ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మామిడితోట యజమాని చేబ్రోలు కృపారాజు సైతం వసంతకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు చేబ్రోలు రాజుకి బంధువు కావడం గమనార్హం.

అన్న క్యాంటీన్‌ నడుపుతున్న నిందితుడు..
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలలో ఒకడైన చేబ్రోలు రాజు రెండేళ్లుగా మైలవరంలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి ప్రధాన అనుచరుడిగా ఉన్న రాజు, వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆయన పంచన చేరి మద్యం సరఫరా బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం బాటిళ్లను డంపు చేసిన మామిడితోట సైతం రాజు బంధువు చేబ్రోలు కృపారాజుకు చెందినది కావడం, ఆయన కూడా వసంతకు ప్రధాన అనుచరుడు కావడం, పట్టబడిన మిగిలిన నలుగురు నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు కావడంతో వసంత వెంకటకృష్ణ ప్రసాదే ఈ మద్యంను డంపు చేయిస్తున్నారు అనడానికి బలం చేకూరింది.

మద్యం విలువ రూ.30లక్షలు..
పట్టుబడిన మద్యం విలువ రూ.30లక్షలు ఉంటుందని మైలవరం డివిజన్‌ అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సి. భార్గవ విలేకరుల సమావేశంలో తెలిపారు. మద్యం రవాణా చేస్తున్న రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులను ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనం, 150కేస్‌లు మద్యం బాటిళ్లు, డంపు చేసిన మరో 250కేస్‌ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలలో ఈ మద్యం బాటిళ్లను పంపిణీ చేసేందుకే తెలంగాణ నుంచి నియోజకవర్గంలోకి తీసుకొస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement