అంగరంగ వైభవంగా.. విశ్వవ్యాప్తంగా ప్లవ నామ ఉగాది | TANA Prapancha Sahithya Vedika Ugadi Kavi Sammelanam | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా.. విశ్వవ్యాప్తంగా ప్లవ నామ ఉగాది

Published Wed, Apr 14 2021 8:39 PM | Last Updated on Wed, Apr 14 2021 8:56 PM

TANA Prapancha Sahithya Vedika Ugadi Kavi Sammelanam - Sakshi

న్యూ యార్క్ : ప్రపంచ సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, (తానా)సాహిత్య విభాగం – తానా  ప్రపంచ సాహిత్య వేదికనిర్వహణలో - "ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం - 21" భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11ఉదయం 9 గంటల వరకు 25 గంటల పాటు అంతర్జాల దృశ్య సమావేశం నిర్విరామంగా,అపూర్వంగా జరిగింది. ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా భారత దేశం, అమెరికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని, 21తెలుగు సంఘాలనుండి 246 మంది కవులు, పండితులు, సాహితీప్రియులు,యువతీ యువకులు అత్యంత ఉత్సాహంగా ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.

ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కళ్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మి భావజలు శ్రావ్యంగాగానం చేసిన “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన సందేశంలో – తానా సంస్థ తెలుగు భాషా సంస్క్రుతలకు ప్రాధాన్యమిస్తూ 21 దేశాల్లోని, 21 సంస్థలతో ప్రపంచ మహాకవి సమ్మేళనం నిర్వహించడం ఆనంద దాయకమని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

తానా అధ్యక్షులుతాళ్ళూరి జయ శేఖర్ మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇంతటి బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగింది. మాతృభాషలోనే మన నాగరికత, ఉనికి ఇమిడి ఉన్నాయి. భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని" పిలుపునిచ్చారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో సాహిత్య సమావేశాలను, మరి కొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకుంటున్నామని, కాని ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని, విశ్వ వ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులకు, భాషాభిమానులకు, వీక్షకులకు ఘన స్వాగతం పలికారు.

25 గంటల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనం వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్నిర్వహణలో ఆద్యంతం అతి వైభవంగా జరిగింది.తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల కావలసిన సాంకేతిక సహకారాన్ని అందించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లబ్ద ప్రతిష్టులైన కవులు, పండితులు తమ కవితలతో ఆద్యంతం అలరించారు. ఒక్కో దేశానికి ఒక్కో గంట సమయం కేటాయించబడి ఆగంటలో ఆ దేశానికి సంబంధించిన కవులతో కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి.

ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్  శ్రీ జి. చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసంగించారు.

ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా. కె. ఐ. వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్దే భాషా పరిరక్షణకుమూలమని, ఆదిశగా అందరూఆలోచించాలని" అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి, ప్రత్యేక అతిధులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు జాస్తి విష్ణు(ఈనాడు), కె.  శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), దిలీప్ రెడ్డి (సాక్షి) హాజరై భాషాభివృద్దికి విలువైన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  వివిధ  సంస్థలు:
శ్రీ సాంస్కృతిక కళా సమితి- సింగపూర్; మలేషియా తెలుగు సంఘం- మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి – బెహ్రైన్; తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా - సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్   బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్ల్యాండ్ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లండ్  తెలుగు సంఘం- నార్తర్న్ ఐర్లండ్;  తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్- స్కాట్ లాండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజీల్యాండ్ – న్యూజీల్యాండ్; తెలుగు మల్లి – ఆస్ట్రేలియా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా; అమెరికా, మరియు భారతదేశం.

వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసిన యాజమాన్యాలకు, కార్యవర్గసభ్యులకు, తెలుగు సంఘాల అధ్యక్షులకు, పాల్గొన్న సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement