US: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ! | Bus Vs Plane: Definitely Bus Better For Really Long Journeys In US | Sakshi
Sakshi News home page

విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!

Published Thu, Mar 21 2024 10:26 AM | Last Updated on Thu, Mar 21 2024 12:54 PM

Bus Vs Plane: Definitely Bus Better For Really Long Journeys In US - Sakshi

మనం ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వందల సంవత్సరాలనాటి దారులనే అటు ఇటుగా బాగుచేసుకుంటూ వాటిపైనే ప్రయాణాలు చేస్తున్నాం. అమెరికా వాళ్ళు రాబోయే వందేళ్ల అవసరాలకు ఉపయోగపడే విశాలమైన రోడ్లు దేశమంతా ఎప్పుడో వేసుకున్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన భారతీయులను ముందుగా ఆశ్చర్యచకితులను చేసేవి అక్కడి పెద్దపెద్ద లైన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు. 

అక్కడ రోడ్ల మీద మనకు మనుషులు కనబడరు, పరుగులు తీస్తున్న  వాహనాలే దర్శనమిస్తాయి. గుంపులు గుంపులుగా మనుషులను చూడాలంటే మాల్స్కో, సినిమా హాల్స్ కో వెళ్లాల్సిందే. మన దేశంలో మనుషుల కొరత మాత్రం లేదు, ఎక్కడికి వెళ్లినా తనివితీరా చూడొచ్చు, చివరికి ఇండ్లలో కూడా. అయితే ఈ మానవ వనరులే మనకిప్పుడు పెద్ద పెట్టుబడి అయింది నిజం.అమెరికాలో జనం ఎక్కువగా విమానాల్లోనే దూర ప్రయాణాలు చేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మనవాళ్లతో పోల్చుకుంటే అక్కడ రైలు, బస్సు ప్రయాణాలు చాలా తక్కువనే చెప్పాలి, వాళ్లకు అంత ఓపిక ఉండడం లేదు. 

అక్కడి బస్సుల్లో ఎక్కువగా తిరిగేది శ్రామిక వర్గానికి చెందిన నల్లవారు, మెక్సికో, చైనా వంటి దేశస్తులు. నేను 2008లో అమెరికాలో పర్యటించినప్పుడు తప్పనిసరై టెక్సాస్‌లోని డాలస్‌ నుంచి వేన్‌ కౌంటీలో ఉన్న టేలర్‌కు బస్సులో జూన్ 7 న ప్రయాణమై వెళ్ళాను. అమెరికా వెళ్లి అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న మా బంధువుల అబ్బాయి ప్రోత్సాహంతో బస్సు ఎక్కాను. సరదాగా ఉంటుంది వెళ్ళమని నన్ను డల్లాస్ - టేలర్  బస్ జర్నీ కి ప్రోత్సహించింది అతనే.

ఆ రోజుల్లో ఈ ప్రయాణ ఛార్జి 44.50 డాలర్లు, మన రూపాయల్లో దాదాపు 3 వేల పైమాటే. నా పాసుపోర్టు  చూశాకనే, లగేజీ చెక్ చేశాకనే బస్సులోకి అనుమతించారు. నేను ఎక్కింది వన్ మ్యాన్ సర్వీస్ కావడం వల్ల అన్ని పనులు డ్రైవరే చూసుకునేవాడు, ప్రయాణికుల లగేజీ సర్దిపేట్టేది ఆయనే, వారు దిగేప్పుడు తీసి ఇచ్చేది కూడా అతనే. ఇది చిన్న పని అది పెద్ద పని అనే ఆలోచన చేయకుండా, ప్రయాణికుల నుండి ఏమీ ఆశించకుండా ఓపిగ్గా అన్నీ డ్రైవరే చేయడం విశేషం. అన్నట్లు అమెరికాలో లేడీ డ్రైవర్లు కూడా ఎక్కువే. 

అమెరికాలో గ్యాస్ స్టేషన్లు అంటే పెట్రోల్ బంకులు చాలా సర్వీస్ చేస్తుంటాయి. అక్కడ కేవలం గ్యాస్ మాత్రమే కాదు ప్రయాణికులకు కావలసిన వస్తువులు దొరుకుతాయి, తినడానికి, విశ్రాంతికి సౌకర్యంగా ఉంటుంది. పాకిస్తానీలు చాలా మంది ఈ స్టేషన్ స్వంతదారులు, పనిలో మనవాళ్ళు కనబడుతుంటారు, ఒంటరిగా ఉంటే గన్తో వచ్చి బెదిరించి ఉన్నవి లాక్కునేవాళ్ళను స్థానికులు అంటారు. మన గమ్యం వస్తుందంటే డ్రైవరే అనౌన్స్ చేస్తుంటాడు, అతన్ని టీవీ స్క్రీన్ మీద గమనించవచ్చు. బస్ టికెట్తో పాటు ఇచ్చిన ప్రకటనల బ్రోచర్స్లో ఆనాటి ఇరాక్ యుద్ధం వల్ల సైనికుల అవసరం పెరిగి సైన్యంలో చేరమన్న విజ్ఞప్తులు కనబడ్డాయి.

బస్సులో చాలా మంది ఆడవాళ్లు మేకప్‌తో కాలక్షేపం చేస్తుంటే మరికొందరు మ్యూజిక్ వింటూ ఊగిపోయేవారు. బస్సులోనే చిన్న టాయిలెట్ మంచి సౌకర్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ త్రాగడం నిషేధం. డౌన్ టౌన్ లో ప్రవేశించే వరకు ప్రయాణం  ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగానే సాగింది. డాలస్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరిన బస్సు దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత గమ్యస్థానం చేరింది. భారతదేశంతో పోలిస్తే.. ఇక్కడి బస్సు ప్రయాణంలో ఎలాంటి అలసట అనిపించలేదు. సుఖవంతమైన ప్రయాణం కదా అనిపించింది. బస్సులోన నిశబ్ధం, విశాలమైన రోడ్లపై వాహనాల టైర్ల సౌండ్‌, మధ్యమధ్యన బ్రేక్‌లలో స్నాక్స్‌. ఇప్పుడు హైదరాబాద్‌ - విజయవాడ మధ్య, హైదరాబాద-బెంగళూరు లేదా విజయవాడ - విశాఖ మధ్య బస్సు ప్రయాణం కూడా ఇలాంటి అనుభవమే కనిపిస్తోంది. మున్ముందు మనం కూడా అమెరికా తరహాలో రోడ్డు ప్రయాణం ఉంటుందని ఆశిద్దాం

వేముల ప్రభాకర్‌

(చదవండి: US: అమెరికాలో 911..అదో పెద్ద హడావిడి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement