BRS MLAs Poaching Case: Supreme Court Key Comments On Pen Drives - Sakshi
Sakshi News home page

అసంపూర్తిగా ముగిసిన ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ.. కేసీఆర్‌ పెన్‌డ్రైవ్‌లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

Published Mon, Feb 27 2023 3:54 PM | Last Updated on Mon, Feb 27 2023 7:51 PM

Telangana BRS MLAs Poaching Case Supreme Court Hearing - Sakshi

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా ముగిసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కోర్టు సమయం ముగియడంతో వాదనలను నిలిపివేసింది. 

శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు కావడంతో  శుక్రవారమే  విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టును కోరారు. అయితే శుక్రవారం విచారించటం సాధ్యం కాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది.

సోవారం వాదనల సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐ‍కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను ఆలకించింది.

అ‍నంతరం జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్‌లు జడ్జీలకు పంపడం సరైన విషయం కాదన్నారు.  ముఖ్యమంత్రి నేరుగా తమకు పంపడం బాగాలేదన్నారు. ఒక సామాన్యుడు చేస్తే ఏమైనా అనుకోవచ్చు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే సిట్ కూడా మీ ప్రభుత్వం అధీనంలో ఉంది కదా? అని అడిగారు.

పెన్‌డ్రైవ్‍లపై క్షమాపణలు..
జడ్జీలకు సీఎం కేసీఆర్ కేసు వీడియోల పెన్‌డ్రైవ్‌లు పంపడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టలని చూస్తే ఆ పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా,  జరిగిన కుట్రను చెప్పకూడదా అని కోర్టుకు తెలిపారు.  

'బీజేపీ నేతలు కేసులో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది, సీబీఐ పారదర్శకంగా విచారణ జరపదు. దేశంలో ఉన్న ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయి. 8 ప్రభుత్వాలను కూల్చారు. మనీష్ సిసోడియా వ్యవహారం అంతా సీబీఐ బయటకు చెబుతోంది. కేవలం ప్రతిపక్ష నేతల వెంట పడుతున్నారు. బీజేపీ నేతలను మాత్రం పట్టుకోవడం లేదు. కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించవద్దు. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరంలో చిలకలాగా మారింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచి ఒకసారి సమర్థించి మరొకసారి వ్యతిరేకించింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా బీజీపీ నేతలు దురుద్దేశపూర్వకంగానే మరో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళితే అన్ని ఆధారాలు ధ్వంసం అయిపోతాయి. కేసు పూర్తిగా నీరు గారి పోతుంది' అని దవే కోర్టుకు తెలియజేశారు.

'బీజేపీలో జాయిన్ అయితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని, పదవులు ఇస్తామని డీల్ పెట్టారు. బీజేపీలో జాయిన్ కాకపోతే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని బెదిరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టలని చూశారు. అందుకే ట్రాప్ వేసి పట్టుకున్నాం. అన్ని వీడియో రికార్డులు మా వద్ద ఉన్నాయి బీఎల్ సంతోష్ , రామచంద్ర భారతి సమావేశం జరిగింది. వాట్సాప్ చాట్ కూడా ఉంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు బీఎల్ సంతోష్‌కు ఇచ్చారు.  బీఎల్ సంతోష్, తుషార్, రామచంద్ర భారతి సమావేశం ఢిల్లీ నివాసంలో జరిగింది. ఫోన్ లోకేషన్స్ అన్నీ దొరికాయి. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేసింది.' అని దవే కోర్టుకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement