అఖండ భారత్‌కు ప్రతీక  | Ayodhya Ram Temple Resolution Passed In Parliament, Details Inside - Sakshi
Sakshi News home page

అఖండ భారత్‌కు ప్రతీక 

Published Sun, Feb 11 2024 6:03 AM | Last Updated on Sun, Feb 11 2024 11:21 AM

Ram Temple resolution in Parliament - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయాన్ని ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తికి పరిపూర్ణ ప్రతీకగా పార్లమెంటు అభివర్ణించింది. శనివారం ఈ మేరకు ఉభయ సభలు తీర్మానాలను ఆమోదించాయి. ఆలయ నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై రాజ్యసభలో చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ లో స్పీకర్‌ ఓం బిర్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు. ‘‘శతాబ్దాల ఎదురుచూపుల అనంతరం సుపరిపాలన, ప్రజా సంక్షేమ రంగాల్లో నూతన శకానికి రామాలయ నిర్మాణం నాంది పలికింది. అది కేవలం రాళ్లు, ఇటుకలతో కూడిన నిర్మాణం కాదు.

నమ్మకం, విశ్వాసాలతో నిండిన జాతి ప్రతీక. ఈ చారిత్రక క్షణాన్ని సాకారం చేయడంలో న్యాయవ్యవస్థ, పౌర సమాజం కూడా కీలక పాత్ర పోషించాయి’’ అంటూ వారు కొనియాడారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు దేశ లౌకికత్వ విలువలను ప్రతిఫలించిందని లోక్‌సభలో చర్చలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. మందిర నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలనూ ప్రధాని మోదీ భాగస్వాములను చేశారన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ మెజారిటీ సామాజిక వర్గం ఇలా తమ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై ఇంతటి సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి రాలేదన్నారు.

జనవరి 22న మందిర ప్రారంభంతో మహోన్నత భారత్‌ దిశగా గొప్ప ప్రయాణం మొదలైందని, మన దేశం విశ్వగురువుగా ఆవిర్భవించేందుకు దారులు పడ్డాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి ప్రజల ఆకాంక్షలను మోదీ సర్కారు నెరవేరుస్తుందని చెప్పారు. చరిత్రాత్మక రథయాత్ర ద్వారా ఆలయ నిర్మాణంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే ఆడ్వాణీ కూడా కీలక పాత్ర పోషించారని అమిత్‌ షా గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాలు సభలు ఆమోదం పొందాయి.

జన్మస్థలికి వందల మీటర్ల దూరంలో ఆలయ నిర్మాణం: కాంగ్రెస్‌ 
అయోధ్య రామాలయంపై కొత్త చర్చకు కాంగ్రెస్‌ తెర తీసింది. రామ మందిర నిర్మాణంపై రాజ్యసభ చేపట్టిన స్వల్ప వ్యవధి చర్చ ఇందుకు వేదికైంది. రాముని అసలు జన్మస్థలికి కొన్ని వందల మీటర్ల అవతల ఆలయాన్ని నిర్మించారని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ అన్నారు. కావాలంటే దీనిపై పరిశీలనకు ఎంపీలతో అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆలయ నిర్మాణం పూర్తవకుండానే ప్రారంభించడం పూర్తిగా శాస్త్రవిరుద్ధమన్నారు. అసంపూర్తి ఆలయంలో పూజలు చేస్తే దేశానికే అరిష్టమని వాదించారు. పైగా ఆలయ ప్రారంపోత్సవంలో అన్ని నిబంధనలనూ యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. 

ఉభయసభలు నిరవధిక వాయిదా 
పార్లమెంటు ఉభయసభలూ శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఈ ఐదేళ్లలో సభ 222 బిల్లులను ఆమోదించినట్టు స్పీకర్‌ తెలిపారు. ‘‘అధికార, విపక్ష సభ్యులను నేనెప్పుడూ సమానంగానే చూశా. కాకపోతే సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు, రాజ్యసభ 263వ సమావేశాలు కూడా ముగిశాయని చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభలో ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement