రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం.. | Pharma Companies May Pay Penalty For Violating Norms | Sakshi
Sakshi News home page

రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..

Published Fri, Mar 26 2021 1:13 AM | Last Updated on Fri, Mar 26 2021 12:46 PM

Pharma Companies May Pay  Penalty For Violating Norms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్‌ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్‌ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు.

ప్రధానంగా రిఫ్రిజిరేటర్‌లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్‌ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్‌ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్‌ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది.

అంతేగాక లేబిలింగ్‌ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం  తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్‌ ఆఫీసర్‌ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్‌ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్‌ బ్లడ్‌ సెల్స్, ప్లేట్‌లెట్స్‌ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 

21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్‌ షాపుల్లోనే..
మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్‌ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్‌ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. 
(చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్‌ ఎమ్మెల్యే బూతు పురాణం)



వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు..
గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి.

  • ప్రతిష్టాత్మక నిమ్స్‌ ఆసుపత్రిలో 2019లో ఔట్‌పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్‌న్‌ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. 
  • వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్‌ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది.
  • అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. 
  • ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్‌ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. 
  • ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 
  • 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్‌ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్‌ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. 
  • ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. 
    (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement