ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు! | Odisha: Adr Reports 65 Newly Elected Zp Members In Serious Criminal Charges | Sakshi
Sakshi News home page

ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!

Published Fri, May 20 2022 12:18 PM | Last Updated on Fri, May 20 2022 12:22 PM

Odisha: Adr Reports 65 Newly Elected Zp Members In Serious Criminal Charges - Sakshi

రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్‌ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్‌ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. 

భువనేశ్వర్‌: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్‌ వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ ఏడీఆర్‌ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్‌ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్‌ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

కలంకితులు.. 
పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్‌ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్‌ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి.  

సగటు ఆస్తుల విలువ.. 
కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్‌ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. 

విద్యాధికులు అంతంతమాత్రమే.. 
తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. 

చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement