MP Vijaya Sai Reddy Analysis On Age Limit Required For PM Post - Sakshi
Sakshi News home page

ప్రధాని పదవికి వయసు అడ్డంకి కాదేమో!

Published Tue, Jul 11 2023 3:16 PM | Last Updated on Tue, Jul 11 2023 3:51 PM

MP Vijaya sai Reddy Analysis on Age Limit Required For PM Post - Sakshi

భారతదేశం సహా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభల సభ్యత్వం పొందడానికి రాజకీయ నాయకులకు ఎలాంటి వయోపరిమితి లేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టడానికి కూడా ఇంత వయసు దాటిన నేతలు అనర్హులు అనే నిబంధన ఏదీ లేదు. రాజ్యాంగ, రాజకీయ పదవులకు గరిష్ఠ వయోపరిమితి లేకపోవడం సబబేనని, మానసిక సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంత వయసువారైనా పదవుల చేపట్టడంలో తప్పేమీ లేదని ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజ్యాంగ నిపుణులూ, ప్రజాతంత్రవాదులూ అభిప్రాయపడుతున్నారు.

81 ఏళ్లకు ప్రధానిగా మొరార్జీ దేశాయి
నిజమే, శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నంత వరకూ ప్రజలు ఎన్నుకున్నంత కాలం ఏ వయసు నాయకులైనా పదవులు అధిష్ఠించడం సక్రమమేనని రాజనీతి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇండియాలో 1977 మార్చి లోక్‌ సభ ఎన్నికల అనంతరం తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత మొరార్జీ దేశాయి వయసు 81 సంవత్సరాలు. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అయిన మొరార్జీ భాయ్‌ ఇంత పెద్ద వయసులో ప్రధాని పదవికి ఎన్నికకావడమేమిటని కొందరు వ్యాఖ్యానించారు.

చరిత్రకెక్కిన రాజీవ్‌ గాంధీ
మంకు పట్టుదల ఉన్న నేతగా అప్పటికే పేరున్న గాంధీయవాది మొరార్జీ 2 ఏళ్ల 4 మాసాలు ప్రధానిగా కొనసాగారు. 1896 ఫిబ్రవరి 29న జన్మించిన దేశాయి జీ 99 ఏళ్లు జీవించారు. ఆ తర్వాత మళ్లీ దేశ ప్రధాని అయిన ఏ నాయకుడి వయసు గురించీ చర్చ అంతగా జరగలేదు. 1984 చివరిలో తల్లి మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్‌ గాంధీ వయసు 40 ఏళ్లు. ఇండియాలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు. అనంతరం 1997లో 77 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ గురించి కూడా అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. ఆయన దాదాపు 11 నెలలు పదవిలో కొనసాగారు.

పదేళ్లపాటు ప్రధానిగా చేసిన మన్మోహన్‌ సింగ్‌
గుజ్రాల్‌ తర్వాత 1996 మార్చిలో బీజేపీ తరఫున తొలి ప్రధాని అయిన అగ్రనేత అటల్‌ బిహారీ వాజపేయి 73 ఏళ్లు దాటాక అత్యున్నత పదవిని అధిష్ఠించారు. మళ్లీ వరసగా 1998, 1999లో ప్రధాని పదవి చేపట్టి 6 ఏళ్ల 2 మాసాలు కొనసాగిన వాజపేయి 79 సంవత్సరాల వయసులో పదవి నుంచి దిగిపోయారు. 2004 పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వయసు అప్పటికి 71 ఏళ్లు. పదేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగాక 2014 మే నెలలో పదవి నుంచి దిగిపోయినప్పుడు మన్మోహన్‌ జీ వయసు 81 సంవత్సరాలు. 16వ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో 2014 మేలో 63 సంవత్సరాల వయసులో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ.

వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఎన్నికైతే..
 2024 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ జీ ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీపడి మూడోసారి ప్రధాని అయ్యే పక్షంలో ఆయన 78 ఏళ్ల ఆరు నెలల వయసులో 2029 మే నెలలో ఉన్నత పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన ప్రముఖుల వయసు గురించి ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రస్తావించడానికి కారణాలు లేకపోలేదు.

అధ్యక్షుడి హోదాలో బైడెన్‌ 80వ పుట్టిన రోజు
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్‌ (జో) బైడెన్‌ పదవిలో ఉండగా 80వ పుట్టినరోజు జరుపుకున్న మొదటి దేశాధినేతగా చరిత్రకెక్కారు.అంతేగాక, ఈ వయసులో ఆయన కొద్ది నెలల క్రితం తాను రెండోసారి అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్టు ప్రకటించారు. ఒకవేళ బైడెన్‌ పార్టీ టికెట్‌ సంపాదించి 2024 నవంబర్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే–81 సంవత్సరాల వయసులో 2025 జనవరి 20న దేశాధ్యక్షునిగా ప్రమాణం చేసే తొలి నాయకుడిగా కొత్త రికార్డు నెలకొల్పుతారు. 1951లో పూర్తి చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా అమెరికా అధ్యక్ష పదవిని రెండుసార్లు మించి నిర్వహించకూడదనే నిబంధన అమలులోకి వచ్చింది.

అంతేగాని, దేశాధ్యక్ష పదవికి పోటీపడడానికి అమెరికాలో గరిష్ఠ వయోపరిమితి లేదు. అంతేగాక, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు, గవర్నర్‌ పదవులు సహా అన్ని చట్టసభల పదవులుకు పోటీచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఇండియాలో ఏ పదవి కోసమైనా ఎన్నిసార్లయినా లేదా ఏ వయసులోనైనా పోటీచేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. పదవులకు పోటీపడే నాయకుల శారీరక, మానసిక ఆరోగ్యం  బాగుంటే నేతల వయసుపై జనం పెద్దగా చర్చించరు.


-విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement