MP: A man sold blood for daughter treatment, sad story - Sakshi
Sakshi News home page

బిడ్డ కోసం రక్తం అమ్ముకున్న తండ్రి.. పోరాడి గెల్చివుంటే ఇంకా బాగుండు కదా!

Published Thu, Apr 20 2023 2:45 PM | Last Updated on Thu, Apr 20 2023 3:01 PM

MP Man sold Blood For Daughter Treatment Sad Story - Sakshi

జనాభాలో భారత్‌ చైనాను అధిగమించింది. మరి మానవాభివృద్ధిలో ఎక్కుడున్నాం?. ఎక్కడో చివర్లో ఉన్నాం. సాంకేతికత, సోషల్‌ మీడియా గురించి నిత్యం మాట్లాడుకునేం మనం.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం మాటకొచ్చేసరికి చర్చల్లో వెనకబడిపోతాం. దేశంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కథలు కళ్లకు కట్టేలా కనిపిస్తున్నా.. ‘అయ్యో అనుకోవడం’ తప్పించి అంతకు మించి ఏం చేయని పరిస్థితి మనలో చాలామందిది. ఇప్పుడు చెప్పుకోబోయేది కథ కాదు.. కూతురి కోసం పోరాడుతూ జీవితంలో ఓడిన ఓ తండ్రికి సంబంధించిన విషాద గాథ. 

తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన  కూతురి కోసం తాను చేయగలిగిందంతా చేశాడు ఓ వ్యక్తి. సాయం కోసం ఎదురు చూసి.. చూసి విసిగిపోయాడు. చివరకు కూతురిని కాపాడుకోలేనేమో అనే బెంగతో ఆర్థిక కష్టాల నడుమ నిస్సహాయ స్థితిలో ప్రాణం తీసుకున్నాడు. 

అనుష్కా గుప్తా.. ఐదేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక విరిగి మంచానికే పరిమితమైంది. ఆమె చికిత్స కోసం తండ్రి ప్రమోద్‌ ఉన్న ఇంటిని, దుకాణాన్ని అమ్మేశాడు. అప్పులు చేసి మరీ మందులు, థెరపీలు చేయించాడు.  అయినా ఆమెకు నయం కాలేదు.  ఈలోపు ఆర్థిక సమస్యలు ఇంటిదాకా వచ్చాయి. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ వచ్చే డబ్బు ఏపాటికీ సరిపోలేదు. 

గత్యంతరం లేక రక్తం అమ్ముకుని.. 
ఈ లోపు అధికారులు సాయం అందిస్తామని మాటిచ్చారు. ఆ విషయాన్ని కొందరు నేతలు కూడా మైకుల్లో మీడియా ముందు అనౌన్స్‌ చేసుకున్నారు. అది పట్టుకుని   గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ, స్థానిక నేతల ఇళ్ల చుట్టూ ఏడాదిపాటు తిరిగి తిరిగి అలిసిపోయాడా తండ్రి.  ఇంట్లో తినడానికి ఏం లేని పరిస్థితుల్లో.. తరచూ రక్తం సైతం అమ్ముకున్నాడు ప్రమోద్‌.  ఏడాది కాలంగా గుప్తా ఇంటి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. శక్తిహీనుడైన ఆ తండ్రి కూతురి కోసం తానేం చేయలేకపోతున్నాననే నిరాశ,  ఆర్థికంగా కుంగిపోయి నిస్పృహలోకి కూరుకుపోయాడు. చివరకు ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. 

కూతురి ఆరోగ్యం విషయంలో అప్పటికే దిగులుగా ఉన్న ప్రమోద్‌ కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..   మంగళవారం సాత్నా రైల్వే పట్టాలపై ప్రమోద్‌ శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. 

బంగారు తల్లీ.. ఏం చేయలేపోతున్నానమ్మా!
అనుష్కా గుప్తా.. సరస్వతి పుత్రిక. ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైనా సరే పుస్తకాన్ని వదల్లేదు. కూతురిలోని ఆ ఆసక్తికి చంపడం ఇష్టం లేక.. ఇంటి నుంచే ఆమె చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు ప్రమోద్‌. ఓ మనిషి సాయంతో ఆమె బోర్డు పరీక్షలు రాసింది.  బోర్డు ఎగ్జామ్స్‌లో ఆమె సాధించిన ప్రతిభకు విద్యాశాఖ సత్కారం కూడా చేసింది. పై చదువుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఆ తండ్రి.. కూతురి ట్రీట్‌మెంట్‌, ఇంటి అవసరాల ఆర్థిక భారాన్ని మోయలేకపోయాడు. బంగారు తల్లి కోసం ఏం చేయలేకపోయానే అనుకుంటూ నిత్యం కుమిలిపోయాడు. పాపం.. ప్రాణం తీసుకునే ధైర్యం ప్రదర్శించిన ఆ తండ్రి..  బదులు పోరాడి అధికారుల నుంచి రావాల్సిన సాయం రాబట్టుకుని ఉంటే బాగుండేదేమో!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement