Farmers movement: రణరంగమైన శంభు సరిహద్దు Farmers movement: Farmers protests to continue as tension mounts at Punjab-haryana border | Sakshi
Sakshi News home page

Farmers movement: రణరంగమైన శంభు సరిహద్దు

Published Sat, Feb 17 2024 5:37 AM | Last Updated on Sat, Feb 17 2024 5:37 AM

Farmers movement: Farmers protests to continue as tension mounts at Punjab-haryana border - Sakshi

చండీగఢ్‌: డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో పంజాబ్‌–హరియాణా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ శుక్రవారం నాలుగో రోజూ అట్టుడికిపోయాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.

ఇరు వర్గాల ఘర్షణలతో శంభు సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా తదితర రైతు సంఘాలు ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వడం తెలిసిందే. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్‌ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవి్వస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు.

శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్‌ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు, రైతు సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్‌ బంద్‌ పిలుపుతో శుక్రవారం పంజాబ్, హరియాణాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైతులు హైవేలను దిగ్బంధించారు.

రేపు మంత్రుల కమిటీ చర్చలు
కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల మూడు సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో చర్చలు ఈ చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి ఐదు గంటలకు పైగా చర్చించినా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement